Begin typing your search above and press return to search.

పాంహౌస్ కి జనాల డబ్బుతో సోకులేంది బాబు?

By:  Tupaki Desk   |   2 April 2016 6:56 AM GMT
పాంహౌస్ కి జనాల డబ్బుతో సోకులేంది బాబు?
X
పదేళ్లు విపక్షంలో ఉన్న చంద్రబాబు.. నాటి అధికారపక్షం చేసే తప్పులపై వరుసగా విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టేవారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్న చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే పరిస్థితులు మరీ ఇంత అస్తవ్యస్తంగా ఉండదన్న భావన వ్యక్తమయ్యేది. అదేం చిత్రమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఖర్చు విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి.

కొద్దిరోజుల పాటు మాత్రమే ఉండే అవకాశం ఉన్న హైదరాబాద్ సచివాలయంలో తన చాంబర్ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టిన వైనం అందరి చేత వేలెత్తి చూపేలా చేసింది. అందరూ అన్నట్లే.. అంత భారీగా ఖర్చు పెట్టి రెఢీ చేసిన తన చాంబర్ లో ఆయన పట్టుమని రెండు.. మూడు నెలలు కూడా కూర్చున్నది లేదు. ఏపీ పాలనను సీమాంధ్రకు తరలించటంతో హైదరాబాద్ లోని ఆయన ఛాంబర్ ఏ మాత్రం ఉపయోగపడింది కాదు.

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం ఛాంబర్ కోసమే దాదాపు రూ.12కోట్లకు పైగా ఖర్చు అవసరమా? అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని ఆయన నివాస గృహానికి.. ఆ తర్వాత వసతి గృహానికి.. తర్వాత మారిన అద్దె ఇంటితో పాటు.. హైదరాబాద్ మదీనాగూడలో ఉన్న ఫాంహౌస్ కు చేపట్టిన సోకులకు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేశారు.

ఈ ఖర్చుల లెక్క మీద ఉన్న విమర్శలు ఇంకా మర్చిపోక ముందే తాజాగా.. మదీనాగూడలోని ఫాంహౌస్ లో అదనపు హంగుల కోసం రూ.1.36కోట్లు ఏపీ సర్కారు విడుదల చేయటంతో బాబు ఖర్చుల లెక్క మరోసారి తెర మీదకు వచ్చింది. ఆర్థిక సంవత్సరం అలా మొదలైందో లేదో.. పాలనా అవసరాల కోసం నిధుల విడుదల సంగతి పక్కన పెడితే.. తొలిరోజునే రోడ్లు.. భవనాల శాఖ విడుదల చేసిన తొలి ఖర్చుల పద్దు చంద్రబాబు సొంత ఫాంహౌస్ కు హంగులు కల్పించేందుకు కావటం గమనార్హం.

హంగుల కోసం విడుదల చేసిన రూ.1.36కోట్ల లెక్కను కాస్త బ్రేకప్ చేసి చూస్తే.. ఫాంహౌస్ లోని హెలిప్యాడ్.. అప్రోచ్ రోడ్డు కోసం రూ.9.80లక్షలు.. ఫాంహౌస్ లోని అంతర్గ రహదారుల నిర్మానానికి రూ.9.5లక్షలు.. బోర్ వెల్.. నీటి ఏర్పాట్లకు రూ.8.4లక్షలు.. వేర్వేరు ప్రాంతాల్లో భద్రత కోసం.. పికెట్ల కోసం నిధులు కేటాయించినట్లు కనిపిస్తోంది. ఇంతేసి భారీగా సొంత అవసరాల కోసం ప్రజాసొమ్మును ఖర్చు చేయటం బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.