Begin typing your search above and press return to search.

కాపుల‌పై ఇంకో స్కెచ్ వేసిన బాబు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:36 AM GMT
కాపుల‌పై ఇంకో స్కెచ్ వేసిన బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా కాపుల‌పై మ‌రో అస్త్రం వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని కొద్దికాలం క్రితం స్వ‌యంగా వ్య‌క్తం చేసిన అభిప్రాయం కావ‌చ్చు...అన్నివ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర చేసుకోవాల‌నే ఆలోచ‌న అయి ఉండ‌వ‌చ్చు...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే కాపులకు రిజర్వేషన్‌ అంశంపై చంద్రబాబు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికీ ఇటీవల విశాఖలో జరిగిన మహానాడులో ఈ అంశం చాలా సున్నితమైనదని చెబుతూనే కాపులకు విద్య - ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్‌ కల్పించే అంశం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్‌ కల్పించే అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం కాపులను బీసీల్లో చేర్చాలి..కాపుల్లో ఉద్యోగులు - విద్యార్ధులు - ఇతర వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక తయారుచేసేందుకు సమన్వయంకోసం మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ బృందంలో హోం మంత్రి చినరాజప్ప - యనమల రామకృష్ణుడు - అచ్చెన్నాయుడు - కాల్వ శ్రీనివాసులు - కొల్లు రవీంద్ర ఉంటారని చంద్రబాబు తెలిపారు.

కాగా కొద్దికాలం క్రితం విదేశీ విద్యా పథకంలో లబ్ధిపొందిన కాపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాపులకు బీసీ జాబితాలో స్థానం కల్పిస్తామని, వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా స్థానం కల్పిస్తామన్నారు. కాపు కార్పొరేషన్‌ కు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించామని, కాపులను నిర్లక్ష్యం చేయబోనన్నారు. మైనార్టీలకు రూ.750 కోట్ల బడ్జెట్ - ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కు రూ.10వేల కోట్లు - ఎస్టీలకు రూ.3850 కోట్ల బడ్జెట్ - బ్రాహ్మణులకు రూ.95 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు ఒక అజెండా అంటూ ఉంటుందని, తనకూ ఉందన్నారు. సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావని, అధికారుల్లో మార్పు రావాలన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యగా చూస్తానని, ప్రపంచాన్ని శాసించే శక్తి విద్యార్థులదేనని ఆయనన్నారు. తాను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, కుటుంబ పెద్దగా ఆలోచిస్తానన్నారు. లంచగొండులను బజారున పెడతానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవినీతికి పాల్పడితే ఖ‌బడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/