Begin typing your search above and press return to search.

పట్టిసీమ.. రాయలసీమకు వరం

By:  Tupaki Desk   |   15 Aug 2015 11:27 AM GMT
పట్టిసీమ.. రాయలసీమకు వరం
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతికి అంకితం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఇటు కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమ ప్రాంతానికి వరంగా మారనుంది. దీనిని ప్రారంభించడం ద్వారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కేసీఆర్ తోపాటు జగన్ పైనా పైచేయి సాధించారు.

కృష్ణా డెల్టాకు కృష్ణా జలాలే ఆధారం. రాష్ట్ర విభజన తర్వాత వీటి కోసం తెలంగాణపై ఆధారపడాల్సిన పరిస్థితి. డెల్టాలో నాట్లు వేసుకోవాలంటే తెలంగాణను నీటి కోసం కోరాల్సిన పరిస్థితి. తెలంగాణ ఒక్క నెల రోజులు జాప్యం చేస్తే అక్కడ నాట్లు వేసే అదును పోతుంది ఆ తర్వాత పంటలు వేస్తే అవి తుపాన్లు, వరదలకు బలి కావాల్సిన పరిస్థితి. తెలంగాణపై ఆధారపడకుండా ఉండడానికి చంద్రబాబు ఎత్తు వేశారు. డెల్టాకు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు వాటిని తీసుకునేలా పట్టిసీమకు శ్రీకారం చుట్టారు. దాంతో కృష్ణా డెల్టాకు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు వస్తాయి. నాట్లు ముందుగానే పూర్తవుతాయి. తుపానులు, వరదలు రాకుండానే పంటలు చేతికొస్తాయి. ఆహార భద్రత సాధ్యమవుతుంది.

కృష్ణా డెల్టాకు వెళ్లాల్సిన నీటిని శ్రీశైలంలో నిల్వ చేసుకోవచ్చు. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయలసీమకు సరఫరా చేయవచ్చు. అక్కడ బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేయవచ్చు. వాస్తవానికి, పోలవరాన్ని పూర్తి చేయవచ్చు. అయితే, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఇద్దరికి దక్కుతుంది. వారిలో ఒకరు దానికి శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే.. మరొకరు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి. దానిని పూర్తి చేసినా చంద్రబాబుకు ఒనగూరే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. అందుకే, రూ.1300 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమకు శ్రీకారం చుట్టారు. దీనిని పూర్తి చేయడం ద్వారా ఆయన కృష్ణా డెల్టా, రాయలసీమ రైతుల అభిమానం పొందుతారు. జగన్ కు,కేసీఆర్ కు చెక్ పెడతారు. అదీ.. పట్టిసీమ..