Begin typing your search above and press return to search.

టీచ‌ర్లు ఏద‌డిగితే... బాబు అదే చేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:30 AM GMT
టీచ‌ర్లు ఏద‌డిగితే... బాబు అదే చేస్తార‌ట‌!
X
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త నేత ఎన్టీఆర్ చేతి నుంచి పార్టీని ప్ర‌భుత్వాన్ని లాగేసుకున్న టీడీపీ ప్ర‌స్తుత జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేతిలో మ‌ట్టి క‌రిచారు. నాడు వైఎస్ చేప‌ట్టిన పాద‌యాత్ర ప‌ట్ల జ‌నంలో సానుకూల దృక్ప‌థంతో నాడు కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే అప్ప‌టికే రెండు ట‌ర్మ్‌ ల పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... ఉద్యోగుల ప‌ట్ల క‌ఠినాతిక‌ఠినంగా వ్య‌వ‌హ‌రించార‌న్న అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. మ‌రో ప‌ర్యాయం కూడా చంద్ర‌బాబే సీఎం అయితే త‌మ ప‌రిస్థితి ఇంకా దారుణంగా త‌యారవుతుంద‌ని కూడా ఉద్యోగులు భావించిన‌ట్లు నాడు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఇక పిల్ల‌లకు విద్యాబుద్ధ‌లు చెప్పే ఉపాధ్యాయులైతే... ఈ విష‌యంలో మ‌రింత‌గా ఆందోళ‌న చెందారు. దీంతో నాడు చంద్ర‌బాబు ఓట‌మే ల‌క్ష్యంగా వారంతా ప‌నిచేశార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. నాటి త‌న ఓట‌మిలో ఉపాధ్యాయులు కూడా కీల‌క భూమిక పోషించార‌ని చంద్ర‌బాబు కూడా అనుమానించారు. అదంతా గ‌త‌మైతే... మూడేళ్ల నాడు రాష్ట్రం రెండు ముక్కలైన త‌ర్వాత‌... 13 జిల్లాల‌తో ఓ ముక్క‌గా మిగిలిపోయిన న‌వ్యాంధ్ర‌కు చంద్ర‌బాబు మ‌రోమారు సీఎం అయ్యారు. అయితే నాడు ఉద్యోగుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... నాటి ప‌రిణామాల‌ను బేరీజు వేసుకుని ఉద్యోగుల‌తో కాస్తంత మెత‌క‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు.

అయితే ఉపాధ్యాయుల విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు అంత‌గా సానుకూలంగా లేర‌న్న వాద‌న మొన్న‌టిదాకా వినిపించింది. ఇంకో రెండేళ్ల‌లోనే ఎన్నిక‌లు రానున్నాయి. ఈలోగా ఉపాధ్యాయుల‌ను మ‌చ్చిక చేసుకోక‌పోతే... త‌న పుట్టి మునుగుతుంద‌ని భావించారో, ఏమో... తెలియ‌దు గానీ.. చంద్ర‌బాబు ఇప్పుడు టీచ‌ర్ల‌పై వ‌ల్ల‌మాలిన ప్రేమను చూపారు. నిన్న తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉపాధ్యాయుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. *ఉపాధ్యాయులు బాధ్య‌త‌గా ప‌నిచేయాలి. గురువులంటే నాకెంతో గౌర‌వం. బ‌దిలీల ప్ర‌క్రియ‌పై ఉపాధ్యాయులు ఎందుకో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను బాగు చేయాలి. అందుకు వారు ఏది చెబితే అది చేయ‌డానికి సిద్ధంగా ఉన్నా. ఉపాధ్యాయులు కూడా స‌హ‌రించాలి* అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉపాధ్యాయుల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌నే ఉద్దేశ్యంతోనే చంద్ర‌బాబు య‌త్నిస్తున్న‌ట్లుగా ఉందంటూ కొన్ని వాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/