Begin typing your search above and press return to search.

రోజాను ఓడించేందుకు బాబు త్రిసభ్య కమిటీ

By:  Tupaki Desk   |   8 March 2019 6:48 AM GMT
రోజాను ఓడించేందుకు బాబు త్రిసభ్య కమిటీ
X
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార టీడీపీలో టిక్కెట్ల కేటాయింపుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాపై ఫోకస్‌ పెట్టారు. ఇక్కడి అభ్యర్థులను ప్రకటించేందుకు సమావేశాలు నిర్వహించారు. మంగళ - బుధ రెండు రోజులు ఈ జిల్లా నాయకులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించిన ఆయన అభ్యర్థులను ఫైనల్ చేశారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను బాబు ఖరారు చేశారు. జిల్లాలోని నగరి నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌ లో ఉంచారు. ఇక్కడ టిక్కెట్టుపై పోటాపోటీ నెలకొన్నందున త్రిసభ్య కమిటీని వేసి అభ్యర్థిని ఫైనల్‌ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి చంద్రబాబునాయుడు - పలమనేరు నుంచి అమరనాథరెడ్డి - చంద్రగిరి నుంచి పులివర్తి నాని పేర్లను చంద్రబాబు ప్రకటించారు. అయితే నగరి నియోజకవర్గంపై మాత్రం త్రిసభ్య కమిటీకే అప్పగించారు. ఈ కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు - ఎమ్మెల్సీలు అశోక్‌ బాబు - జనార్దన్‌ లు ఉన్నారు. వీరు నగరి నియోజకవర్గ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.

గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. మొదటి నుంచి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టే నేతగా పేరు గడించారు. నిత్యం టీడీపీతో పాటు బాబుపై విమర్శలు చేస్తూ వార్తలో నిలిచారు. ఈ నేపథ్యంలో రోజాను ఓడించేందుకు సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలనిబాబు స్కెచ్ గీశారు. ఈ మేరకు ఏకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ప్రస్తుతం నగరి నియోజకవర్గ టీడీపీ టికెట్‌ కోసం పోటాపోటీ నెలకొంది. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోనే పోరు మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు భానుప్రకాశ్‌ ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్నారు. దీంతో ఆయన టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ముద్దుకృష్ణమనాయకుడు సతీమణి - ఎమ్మెల్సీ అయిన సరస్వతమ్మ ఆయన చిన్నకుమారుడు జగదీశ్‌ కు టిక్కెట్‌ కావాలని అడుగుతున్నారు.

ఇక మరోవైపు నగరి సీటుకోసం సిద్ధార్థ కళాశాలల చైర్మన్‌ అశోక్‌ రాజు రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణులంతా అశోక్‌రాజుకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాధాకృష్ణ - పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంధమనేని రమేశ్ చంద్రప్రసాద్‌ లు అశోక్‌రాజుకు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆసక్తి టీడీపీ వర్గీయుల్లో నెలకొంది. మొత్తానికి తనకు కొరకరాని కొయ్యగా మారిన రోజాను ఓడించేందుకు బాబు పట్టుదల గా ఉన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది.