Begin typing your search above and press return to search.

భూమాకు బాబు ఇచ్చే లడ్డూ అదేనా?

By:  Tupaki Desk   |   19 Sep 2016 6:26 AM GMT
భూమాకు బాబు ఇచ్చే లడ్డూ అదేనా?
X
ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారటంలో అంతర్యం ఏమిటని ఏ జంపింగ్ నేతను అడిగినా వారి నోటి నుంచి వచ్చే మాటలు వింటే.. అన్ని తెలిసిన వారు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. అందరికి తెలిసిన నిజాన్ని ఎంత అందంగా కవర్ చేస్తున్నారన్న భావన కలుగుతుంది. తెలంగాణలో జంపింగ్ నేతల్ని ఎవరిని పలుకరించినా.. ‘‘బంగారు తెలంగాణ’’ కోసమేనన్న మాట వస్తే.. ఏపీలో ఇదే విషయాన్ని కదిపితే.. ‘‘అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దటం కోసం’’ అని చెప్పుకొస్తారు. పైకి కనిపించే ఈ మాటలకు.. లోగుట్టుగా జరిగే వాటికి మధ్య అంతరం ఎంతన్నది తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం చెప్పకనే చెప్పేస్తుంది.

పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ఛరిష్మాతో బలమైన రాజకీయనేతలుగా కొందరు ఉంటారు. కర్నూలు జిల్లాలో ఇలాంటి నేతల్లో భూమా నాగిరెడ్డి ఒకరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఆయన వెంట ఉండే వర్గం మాత్రం ఆయన్నేఫాలో అయిపోతుంటుంది. ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీకి చెందిన కొందరు ఆయనకు అదనంగా జత అవుతారు తప్పించి మరింకేమీ ఉండదు.

ఆ మధ్యన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన భూమా సైతం.. అందరి మాదిరే రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ‘సైకిల్’ ఎక్కినట్లుగా చెప్పుకున్నారు. అయితే.. అదే అసలు విషయం కాదన్నది అందరికి తెలిసినా.. ఎవరూ వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అయితే.. ఇప్పుడా అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆయనపై ఉన్న కేసుల్ని ఎత్తివేయాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లుగా చెబుతున్నారు.

విపక్ష నేతగా ఉన్న భూమాపై.. గతంలో రౌడీ షీట్ తెరిచారు. తాజాగా తన మీదున్న రౌడీషీట్ ను ఎత్తివేయాలన్న అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 అక్టోబరు 31న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో.. జగన్ పార్టీలో ఉన్న భూమా.. టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని.. తలుపులు మూయండ్రా అంటూ వారిపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భూమాకు విధేయులైన ఏడుగురు కౌన్సిలర్లపై రౌడీషీట్ నమోదైంది. ఆ తర్వాత కాలంలో ఏపీ అధికారపక్షంలోకి వెళ్లిపోయిన భూమా.. తనపై ఉన్న కేసుల్ని ఎత్తి వేయించుకునే దిశగా పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. భూమా కోరినట్లు కేసుల్ని ఎత్తేసి ‘లడ్డూ’ లాంటి నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.