Begin typing your search above and press return to search.

లోకేశ్ నెత్తినే జీహెచ్ ఎంసీ

By:  Tupaki Desk   |   8 Dec 2015 10:30 AM GMT
లోకేశ్ నెత్తినే జీహెచ్ ఎంసీ
X
జీహెచ్ ఎంసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశిస్తున్న తరుణంలో టీటీడీపీ నేతలు ఆ ఎన్నికల భారాన్ని తమ యువనేత లోకేశ్ బాబు నెత్తిన మోపారు. గెలుపోటములు ఏవైనా సరే ఆయన ఖాతాలోనే వేయాలని సంకల్పించారు. తెలంగాణలోని మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడం కూడా డౌటేనని తేలడంతో చంద్రబాబు తన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేశ్ కు జీహెచ్ ఎంసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. లోకేశ్ ను ముఖ్య నేతలు ఈ విషయంపై విన్నవించుకోవడం ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయి.

అంతేకాదు చంద్రబాబు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అందుకే గ్రేటర్ లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆయన కుమారుడికి వివరించారట. అయితే.. పూర్తిగా స్వీయ నిర్ణయాలపై ఆధారపడకుండా ముఖ్యనేతల సలహాలు తీసుకోవాలని తనయుడికి చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. దీని ప్రకారం గ్రేటర్ ఎన్నికలను లోకేశ్ భుజానికెత్తుకోవడం ఖాయమని తేలిపోయింది. దీనిపై విశ్లేషకులు మాత్రం చంద్రబాబుది తప్పుడు నిర్ణయమని అంటున్నారు. టీఆరెస్ మంచి ఊపు మీద ఉన్న తరుణంలో గ్రేటర్ వంటి సంక్లిష్ట ఎన్నికల రంగంలోకి దిగుతూ ఆ బాధ్యతలను పెద్దగా అనుభవం లేని లోకేశ్ కు అప్పగించడం కరెక్టు కాదంటున్నారు. గ్రేటర్ లో టీడీపీ గెలుపు కష్టమని... ఆ ఓటమి ప్రభావం, మచ్చ లోకేశ్ పై పడుతుందని.. ఆయన కాన్ఫిడెన్సు లెవల్స్ తగ్గుతాయని అంటున్నారు. అంతేకాదు... రాహుల్ గాంధీలా పరాజయాల నేతగా ముద్రపడితే అది ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

అయితే.. చంద్రబాబు మాత్రం ఇప్పటికే ఈ విషయంలో ఫిక్సయిపోయారట. లోకేశ్ ను గ్రేటర్ వార్ కు సేనాధిపతిగా నియమించేశారట. అంతేకాదు... ఆ ఎన్నికలయ్యేవరకు ఏపీ వ్యవహారాల్లో లోకేశ్ జోక్యం చేసుకోకుండా హైదరాబాద్ పైనే దృష్టి పెట్టాలని సూచించారట. చూడబోతే లోకేశ్ ను మరో రాహుల్ గాంధీ చేసేలా ఉన్నారు.