Begin typing your search above and press return to search.

టీడీపీలో ఇంగ్లీష్ తెలిసినోడు ఆయనొక్కడేనా...?

By:  Tupaki Desk   |   21 July 2015 10:45 AM GMT
టీడీపీలో ఇంగ్లీష్ తెలిసినోడు ఆయనొక్కడేనా...?
X
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కొద్దికాలంగా ఓ సమస్య వేధిస్తోంది. పేరుకు ఏపీ సీఎం అయినా ఆయనది నేషనల్ రేంజి... అంతేకాదు.. రాజధాని నిర్మాణం, ఏపీ అభివృద్ధికి పెట్టుబడుల సేకరణ పుణ్యమా అని నిత్యం విదేశాలు తిరుగుతూ ఇంటర్నేషనల్ రిలేషన్సూ మెంటెయిన్ చేస్తున్నారు. బాగా చదువుకున్న చంద్రబాబు ఇంగ్లీష్ లో ఇరగదీస్తారని అందరికీ తెలుసు... ఎటొచ్చీ ఆయన వద్ద ఉన్న మంత్రులు, ఎంపీలు మాత్రం 'యా... యా..'... ఎస్.. ఎస్... ఓకే.. ఓకే... గుడ్ మార్నింగ్... 'హౌ డు యూ డూ' స్థాయి దాటి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారట. దీంతో చంద్రబాబు వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తానే దుబాసీగా మారి వారికి అర్థం వివరించాల్సి వస్తోందట. పైగా ఇటీవల ఓటుకు నోటు, పుష్కరాల ప్రమాదం వంటి అంశాలపై నేషనల్ మీడియా దృష్టి ఏపీపై పడింది. ఇప్పటికే ఒకరిద్దరిని నేషనల్ ఛానళ్లు చర్చావేదికలకు పిలవగా వారు అక్కడ బొమ్మల్లా కూర్చోవడం తప్ప ఏపీని, చంద్రబాబును సపోర్టు చేసేలా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు... పార్టీలో ఇంగ్లీష్ బాగా వచ్చినవారిని సెలెక్ట్ చేసి జాతీయ మీడియా చర్చావేదికలకు పంపాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఇంగ్లీషు మీడియాతో మాట్లాడే బాధ్యతను ఎంపీ గల్లా జయదేవ్‌కు అప్పగించారని తెలుస్తోంది.

ఏపీ మంత్రులు వచ్చీ రాని ఇంగ్లీషు మాట్లాడుతుండటం వల్ల ఇబ్బందులు తెచ్చుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివిధ అంశాల పైన పార్టీ విధానాలు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తదితరాల విషయంలో ఆంగ్లం పైన పట్టున్న జయదేవ్ అయితేనే సమర్థవంతంగా చెప్పగలరని భావించి, అప్పగించినట్లుగా తెలుస్తోంది. గత వారం టైమ్స్ నౌ ఆంగ్ల ఛానల్‌ చర్చావేదిక సందర్భంగా మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పి.నారాయణలతో మాట్లాడింది. వారు ఏపీ తరఫున వాదనను ఏమాత్రం వినిపించలేకపోయారని చంద్రబాబు భావించారని సమాచారం. భద్రతా ఏర్పాట్లలో లోపం వల్ల తొక్కిసలాట జరగలేదని చెప్పడంలో వారు విఫలమయ్యారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. దీంతో, చంద్రబాబు ఎంపీ గల్లా జయదేవ్‌కు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇంగ్లీషులో మాట్లాడే మరికొందరిని గుర్తించే వరకు ఎవరు చర్చా కార్యక్రమాల్లో పాల్గొనరాదని చంద్రబాబు సూచించారట.