Begin typing your search above and press return to search.

టీడీపీలో కోట్లకే ఓటు....డబ్బులకే సీటు

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:03 AM GMT
టీడీపీలో కోట్లకే ఓటు....డబ్బులకే సీటు
X
తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇపుడు ఆర్థిక గౌరవానికి పెద్ద పీట వేస్తోంది. ఆరుగాలం శ్రమించిన కార్యకర్తల కంటే ఆర్థికంగా బలంగా ఉన్న బడాబాబులకే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోంది. తాజాగా జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే ఇందుకు నిదర్శనం అని చెప్తున్నారు. పార్టీ కోసం శ్ర‌మించిన నాయ‌కులు ఉండ‌గా ఆర్థికంగా బ‌లోపేతంగా ఉన్న ఇద్ద‌రికే అవ‌కాశం కట్ట‌బెట్ట‌డం ఇందుకు నిద‌ర్శ‌నమ‌ని అంటున్నారు. పైగా ఒక నాయకుడిపై తీవ్ర‌మైన కేసులు ఉన్న‌ప్ప‌టికీ అనువుగా సీటు ద‌క్క‌డం అంటే ఆర్థిక అండ‌దండ‌లే కార‌ణ‌మ‌ని వివ‌రిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక‌యిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్ ఆర్థికంగా ప‌టిష్ట‌మైన స్థితిలోనే ఉన్నారు. ఈ ఇద్ద‌రు నేత‌ల ఎంపిక‌లో ఆర్థిక ప‌రిపుష్టే కీల‌కంగా మారింద‌నేది తెలుగుదేశం వ‌ర్గాల్లో ఒపెన్ సీక్రెట్‌. ముఖ్యంగా సుజ‌నా చౌద‌రి విష‌యంలో అయితే ఎన్నో ఆర్థికప‌ర‌మైన అది కూడా ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ వంటి సంస్థ‌లు స్పందిచే స్థాయిలో ఆయన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. సుజ‌నా ప‌ద‌వి కాలం ముగుస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న కంపెనీల‌కు చెందిన ప‌లు ఉల్లంఘ‌న‌లు పెద్ద ఎత్తున తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఇంకేం సుజ‌నాకు పొడ‌గింపు చాన్సేలేద‌ని అంతా అనుకున్నారు. అయితే సీన్ రివ‌ర్స్ అయింది! అక్ర‌మం కంటే ఆర్థిక‌మే ముఖ్యం అయింది. సుజ‌నాకు పెద్ద‌ల స‌భలో స‌భ్య‌త్వం రెన్యువ‌ల్ అయింది.

ఇక టీజీ వెంక‌టేశ్ విష‌యంలోనూ ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. టీజీకి పెద్ద ఎత్తున వ్యాపారాలున్నాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆయ‌న‌కు ప్రాంతాల‌కు అతీతంగా తెలంగాణ‌లో కూడా బిజినెస్‌ లు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీవైపే టీజీ క‌న్ను ఉంటుంద‌నే అపప్ర‌ద కూడా ఆయ‌న‌పై ఉంది. అయిన‌ప్ప‌టికీ టీజీకి బాబు బెర్త్ ఖ‌రారు చేశారు. ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌క్కే మూడుస్థానాల్లో ఒక‌టి బీజేపీకి పోగా మిగిలిన రెంటిలో ఒక్క‌టి కూడా సామాన్యుల‌కు కేటాయించ‌కుండా మాన్యుల‌కు క‌ట్ట‌బెట్ట‌డం బాబు గారికే చెల్లింద‌నే అభిప్రాయాలు ప్ర‌తిప‌క్షాల నుంచే కాదు తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో కూడా బాహాటంగానే వినిపిస్తున్నాయి.