Begin typing your search above and press return to search.

నీళ్ల గొడ‌వ‌ను కేంద్రానికి మెలేసిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   18 May 2016 6:14 AM GMT
నీళ్ల గొడ‌వ‌ను కేంద్రానికి మెలేసిన చంద్ర‌బాబు
X
అనుభ‌వం అనుభ‌వ‌మే. వివాదాస్ప‌ద అంశాల విష‌యం మీద ఎంత మాట్లాడినా ఒరిగేది త‌క్కువే. ప‌రిష్కారం ల‌భించేది ఉండ‌దు. ఊరికే మాట‌లు మాట్లాడి.. స‌మ‌స్య‌ను మ‌రింత పీట‌ముడి వేసుకునే క‌న్నా.. తెలివిగా వ్య‌వ‌హ‌రించి.. ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేయ‌టానికి మించిన మంచి ప‌ని మ‌రొక‌టి ఉండ‌దు. ఆ విష‌యాన్ని గుర్తించిన‌ట్లుగా ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు చూస్తుంటే. కృష్ణా.. గోదావ‌రికి సంబంధించిన జ‌ల వివాదం రెండు రాష్ట్రాల మ‌ధ్య మొద‌లైన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గోదావ‌రి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కృష్ణా మీద ఇప్ప‌టికే వివాదం ర‌గులుకుంది.

తెలంగాణ ప్ర‌భుత్వం పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని షురూ చేయ‌టం.. దానికి ఏపీ స‌ర్కారుతో పాటు.. ఏపీ విప‌క్ష నేత సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు.. తెలంగాణ‌వాదులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న ప్రాజెక్టు పంచాయితీల మీద ఏం మాట్లాడినా వివాద‌మే త‌ప్పించి మ‌రొక‌టి ఉంది. ఎవ‌రికి వారు త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్య‌త ఇస్తారే త‌ప్పించి.. ఎదుటివారి అవ‌స‌రాల్ని ప‌ట్టించుకోర‌న్న విష‌యం తెలిసిందే. అందుకే.. మాట్లాడి భావోద్వేగాలు పెంచే క‌న్నా.. ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ప‌డటం మంచిద‌న్న భావ‌న‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్రాజెక్టుల మీద కేంద్రానికి ఫిర్యాదు చేయ‌టం.. అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెబుతున్న బాబు.. తాజాగా త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్ర‌స్తావించిన వైనం ఆయ‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తుంది.

విభ‌జ‌న సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తీర్చాల్సిన పంచాయితీలు ఉన్నాయ‌ని.. వాటికి కేంద్రం బాధ్య‌త తీసుకోవాల‌న్న విష‌యాన్ని తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న శ్రీశైలం.. నాగార్జున‌సాగ‌ర్ సంగతేమిటంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. రెండు బోర్డులు.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన కేంద్రం ఇప్ప‌టివ‌రకూ ఆ ప‌ని చేయ‌లేద‌ని చెప్పిన బాబు.. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో గొడ‌వ‌ప‌డ‌టం మంచిది కాద‌ని.. ప్రాజెక్టు పంచాయితీలు తేల్చేందుకు కేంద్రం త‌ర‌పున వ్య‌క్తులు ఉండాల‌న్న విష‌యాన్ని మోడీకి స్ప‌ష్టం చేయ‌టం ద్వారా.. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న ప్రాజెక్టుల పంచాయితీల్లో కేంద్ర‌మే పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. బాబు ప్ర‌య‌త్నం ఫ‌లిస్తే రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్రాజెక్టుల విష‌యంలోఅభ్యంత‌రాల్ని కేంద్రం తేల్చాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే.. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య అన‌వ‌స‌ర‌మైన భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసిప‌డే ప్ర‌మాదం ఉండ‌ద‌నే చెప్పాలి. ప్రాజెక్టుల పంచాయితీ విష‌యంలో కేంద్రాన్ని సీన్లోకి తీసుకురావ‌టం ద్వారా అన‌వ‌స‌ర ఉద్రిక్త‌త‌ల‌కు బాబు త‌న‌దైన శైలిలో చెక్ చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పొచ్చు.