Begin typing your search above and press return to search.

బాబు తాయిలాలు!... మామూలుగా లేవుగా!

By:  Tupaki Desk   |   13 Feb 2019 9:56 AM GMT
బాబు తాయిలాలు!... మామూలుగా లేవుగా!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారిన‌ట్టున్నాయి. ఎందుకంటే... ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు చూస్తుంటే... అందరిలోనూ అదే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నేడో - రేపో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఇబ్బంది ఎదుర‌వుతుందోన‌న్న భ‌యంతో నేటి తెల్లార‌గ‌ట్లే కేబినెట్ భేటీకి తెర తీసిన చంద్ర‌బాబు... ఆ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాలు చూస్తుంటే... చంద్ర‌బాబును అతి స‌మీపంగా చూస్తున్న వారికే ఆశ్చ‌ర్యం క‌లిగే ప‌రిస్థితి. అన్న‌దాతా సుఖీభ‌వ ప‌థ‌కాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు స‌ర్కారు... విధి విధానాల‌ను ఇంకా రూపొందించ‌లేదు. అయితే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తే... ఆ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డం కుద‌ర‌ద‌ని భావించిన చంద్ర‌బాబు నేటి ఉద‌యం హ‌డావిడిగా నిర్వ‌హించిన కేబినెట్ భేటీలో దీనికి ప‌చ్చ జెండా ఊపారు. స్ప‌ష్ట‌మైన విధి విధానాలు లేకుండానే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన తీరు చూస్తే... చంద్ర‌బాబు ఏ స్థితిలో ఉన్నార‌న్న విష‌యం ఇట్టే తేలిపోతోంది.

స‌రే.. అన్న‌దాతా సుఖీభ‌వ ప‌థ‌కాన్ని కాస్తంత ప‌క్క‌న‌పెడితే.... ఈ కేబినెట్ భేటీలో బాబు స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాలను ఓ సారి ప‌రిశీలిద్దాం. జ‌ర్న‌లిస్టుల గృహ నిర్మాణ ప‌థ‌కం అందులోనూ అమరావ‌తిలో జ‌ర్మ‌లిస్టుల హౌసింగ్ స్కీమ్‌ కు సంబంధించి ఇప్ప‌టికే చంద్ర‌బాబు కేబినెట్‌ ఓకే చేసేసింది. 2 వేల మంది దాకా రాజ‌ధాని ప‌రిధిలో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు అపార్ట్‌ మెంట్ల త‌ర‌హాలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 30 ఎక‌రాల‌ను కేటాయించిన ప్ర‌భుత్వం... ఎక‌రా ధ‌ర‌ను రూ.25 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి జీవో కూడా వెలువ‌డింది. ఇక జ‌ర్న‌లిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమి బ‌ద‌లాయింపే మిగిలి ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో నేటి ఉద‌యం జ‌రిగిన కేబినెట్ భేటీలో మ‌రోమారు ఈ అంశాన్ని ముందేసుకున్న చంద్ర‌బాబు... జ‌ర్న‌లిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఎక‌రం భూమి ధ‌ర రూ.25 ల‌క్ష‌ల‌ను ఏకంగా రూ.10 ల‌క్ష‌ల‌కు త‌గ్గించేసింది.

ఇక ఈ రూ.10 ల‌క్ష‌ల రేటును కూడా జ‌ర్న‌లిస్టులు ఇప్ప‌టికిప్పుడే క‌ట్టే అవ‌స‌రం లేద‌ని చెప్పిన బాబు... దానిని విడ‌త‌ల‌వారీగా చెల్లించుకోవ‌చ్చ‌ని కూడా త‌న‌దైన ఉదార‌త‌ను వ్య‌క్తం చేశారు. ఎక‌రా రూ.10 ల‌క్ష‌ల చొప్పున మొత్తం 30 ఎక‌రాల‌కు అయ్యే మొత్తం రేటు రూ.3 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.1 కోటి చెల్లిస్తే భూమిని బ‌ద‌లాయిస్తామ‌ని, మిగిలిన రూ.2 కోట్ల‌ను మరో రెండు వాయిదాల్లో చెల్లించేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. ఇక స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూడా ఎర వేసిన చంద్ర‌బాబు... ఒక్కొక్క‌రికి 175 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లాన్ని ఇవ్వనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదంతా చూస్తుంటే... బాబు త‌న‌దైన పోల్ మేనేజ్ మెంట్ ను బ‌య‌ట‌కు తీశార‌ని - ఏ ఒక్క వ‌ర్గాన్ని వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా సాగుతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.