Begin typing your search above and press return to search.

టీడీపీ.. ఎక్కడి వారు అక్కడే..!

By:  Tupaki Desk   |   9 March 2019 4:27 AM GMT
టీడీపీ.. ఎక్కడి వారు అక్కడే..!
X
తాము ఎంపీలుగా మళ్లీ పోటీ చేయాలని అనుకోవడం లేదు.. ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వండి.. అని చంద్రబాబుకు విన్నవించుకున్నా అందుకు తగ్గ ఫలితాలు ఏమీ కనిపించడం లేదు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి రెండు మూడేళ్ల కిందటి నుంచినే ప్రయత్నాలు చేసిన పలువురు ఎంపీలకు ఇప్పుడు మళ్లీ అవే టికెట్లు ఖరారు అవుతూ ఉండటం ఆసక్తిదాయకం. పార్టీ తరఫున ఏ రకంగానూ పోటీ చేయమని తప్పుకున్న వారిని చంద్రబాబు నాయుడు వదిలేశారు. అయితే ఎంపీ వద్దు - ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వండి అని చెప్పిన వారికి మాత్రం బాబు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం అవుతోంది.

ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. విజయనగరం ఎంపీ సీటుకు అశోక్ గజపతి రాజు - శ్రీకాకుళం ఎంపీ సీటుకు రామ్మోహన్ నాయుడు - హిందూపురం ఎంపీ సీటుకు నిమ్మల కిష్టప్పలు ఖరారు అయిపోవడాన్ని గమనించవచ్చు. వీరు ముగ్గురూ ఈ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయాలని అనుకోలేదు. తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని వీరు చంద్రబాబుకు విన్నవించారు. బహిరంగ ప్రకటనలు చేసినంత పని చేశారు కూడా. అందుకు తగ్గ సీట్లను కూడా ఎంచుకుని వీళ్లు తమ ప్రయత్నాలు తాము చేశారు.

పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ సీటును తనకు కేటాయించాలని నిమ్మల కిష్టప్ప చంద్రబాబునాయుడుకు విన్నవించినట్టుగా సమాచారం. ఇప్పుడు కాదు.. ఈ విషయంలో రెండు మూడేళ్ల నుంచినే ఆయన ప్రయత్నాలు చేశారు. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లోనూ - పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లో కూడా ఆయన వేళ్లు పెట్టారు. అయితే బాబు మాత్రం ఆయనకు మళ్లీ హిందూపురం ఎంపీ సీటునే ఖరారు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే - ఎంపీ టికెట్ ను త్యాగం చేయడానికి ఆయన రెడీ అయినా బాబు పట్టించుకోలేదు.

ఇక గత ఎన్నికల్లోనే ఎంపీగా పోటీ చేసేందుకు అంత ఉత్సాహాన్ని చూపించలేదు అశోక్ గజపతిరాజు. అప్పుడు ఏదో పార్టీ అవసరం కోసమని ఆయన పోటీ చేశారు. జాక్ పాట్ గా కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. అయితే ఈ సారి రాష్ట్రంలోనే మంత్రి కావాలని - అందుకోసం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది అశోక్ గజపతి కోరిక. అయితే బాబు మాత్రం ఆయనను ఎంపీగానే పోటీ చేయిస్తున్నారు.

ఇక తన బాబాయ్ ను ఎంపీగా పోటీ చేయించాలని - తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు చంద్రబాబుకు చాన్నాళ్లుగా విన్నవిస్తూ వచ్చారట. అయితే ఆయనకూ ఆ అవకాశం దక్కడం లేదు. శ్రీకాకుళం ఎంపీ టికెట్ ను రామ్మోహన్ నాయుడుకే ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు. ఈ విధంగా అచ్చెన్నాయుడుకు బాబు రిలీఫ్ ఇచ్చారు!