Begin typing your search above and press return to search.

విశాఖ నేతలకు చంద్రబాబు షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   16 May 2017 11:23 AM GMT
విశాఖ నేతలకు చంద్రబాబు షాకింగ్ న్యూస్
X
మే నెల అంటే అందరికీ ఎండాకాలమే కానీ టీడీపీ నేతలకు మాత్రం మహానాడు కాలం. మండుటెండలను లెక్క చేయకుండా మహానాడు ఏర్పాట్లలో అంతా బిజీ అయిపోతారు. అయితే... ఈ మహానాడు టీడీపీ నేతలకు పెద్ద ఉత్సాహంగా లేకుండా మారిపోయింది. అందుకు కారణం చంద్రబాబు పేల్చిన బాంబే. ముఖ్యంగా మహానాడుకు వేదికవుతున్న విశాఖ జిల్లా నేతలకు మరింత నిరుత్సాహం వచ్చేసింది.

ఎంపీలు - ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు షాక్ తిన్నారు. మూడేళ్లుగా నామినేటెడ్‌ పోస్టుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు కంగుతిన్నారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్వార్థంతో తెలుగుదేశంలోకి జంప్‌ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకూ అమాత్య పదవి ఖాయమని కలలుగన్నారు. ఈ ముగ్గురికీ మంత్రివర్గంలో ఆ పార్టీ అధినేత మొండిచేయి చూపించారు. దీంతో బండారు సత్యనారాయణ కొద్దికాలం అలక వహించారు కూడా. పార్టీ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి సభలకు కూడా దూరంగా ఉన్నారు. మంత్రి పదవి రాకపోయినా వుడా చైర్మన్‌ పదవి గాని, లేదా కేబినెట్‌ హోదా ఉన్న ఏదైనా కార్పొరేషన్‌ పదవి తనకు వస్తుందని ఎంతో ఆశతో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే అనిత కూడా మంత్రి పదవి రాకున్నా నామినేటెడ్‌ తప్పక వస్తుందని ధీమాగా ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి కూడా ఏదైనా మంచి కేబినెట్‌ హోదా కలిగిన కార్పొరేషన్‌ పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. కానీ... తాజాగా బాబు ఈ బాంబు పేల్చడంతో వారంతా నీరుగారిపోయారు.

దీంతో మరో పది రోజుల్లో మహానాడు జరుగుతున్నందున వీరంతా ఆ కార్యక్రమానికి ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మహానాడు కమిటీల్లో భాగస్వాములై ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. మరి వీరంతా మహానాడు ఎలా విజయవంతం చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/