Begin typing your search above and press return to search.

ఢిల్లీకి చంద్ర‌బాబు.. ప‌రిస్థితుల‌న్నీ అనుకూల‌మ‌య్యేనా?

By:  Tupaki Desk   |   1 Aug 2022 10:40 AM GMT
ఢిల్లీకి చంద్ర‌బాబు.. ప‌రిస్థితుల‌న్నీ అనుకూల‌మ‌య్యేనా?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబులో కొత్త ఉత్సాహం తొణిక‌లాడుతోంది. మే 28, 29 తేదీల్లో ఒంగోలులో నిర్వ‌హించిన మ‌హానాడు ఆ పార్టీ అంచ‌నాల‌కు మించి విజ‌య‌వంత‌మైంది. ఈ ఊపుతో జిల్లాల్లో బాదుడే బాదుడు, మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇవి కూడా స‌క్సెస్ అయ్యాయి. దీంతో చంద్ర‌బాబులో రెట్టించిన ఉత్సాహం వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం అంద‌డం విశేషం. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జాతీయ స‌మావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయ‌న‌కు ఆహ్వానం అందింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆగ‌స్టు 6న ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇటీవ‌ల భీమ‌వ‌రంలో విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబును కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. అయితే ఆయ‌న‌కు బ‌దులుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని పంపింది. అయితే ప్ర‌ధానమంత్రిని హెలిప్యాడులో ఆహ్వానించే వారి జాబితాలో ఆచ్చెన్న పేరు లేద‌న‌డంతో ఆయ‌న వెనుదిరిగారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఢిల్లీ ఆహ్వానం స‌హ‌జంగానే ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. ఈ నేప‌థ్యంలో పాత బంధాన్ని పున‌రుద్ధ‌రిస్తారా అనేదానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

గ‌తంలో 1999, 2004, 2014ల్లో బీజేపీతో క‌ల‌సి పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. బీజేపీతో క‌ల‌సి వెళ్లిన ఒక్క 2004లో మిన‌హా ప్ర‌తిసారి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చారు.

గ‌త ఎన్నిక‌ల ముందు బీజేపీతో సంబంధాలు చెడిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో చంద్ర‌బాబు మాట్లాడ‌తారా? మాట్లాడితే ఏం మాట్లాడ‌తారు అనేదానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.