Begin typing your search above and press return to search.

పెళ్లికి వెళ్లటానికీ ప్రత్యేక విమానమా బాబు?

By:  Tupaki Desk   |   9 Dec 2015 9:30 AM GMT
పెళ్లికి వెళ్లటానికీ ప్రత్యేక విమానమా బాబు?
X
పాలనలో తన మార్క్ చూపించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఖర్చు విషయంలోనూ ఇదే తరహాతో వ్యవహరిస్తుంటారు. ఛాంబర్ల ఏర్పాటు మొదలు.. ఏదైనా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే తత్వం ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే పలు విమర్శలకు గురయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎం ఛాంబర్ కోసం పెట్టిన భారీ ఖర్చు లాంటివి ఆయనపై విమర్శలు రేగేలా చేశాయి.

మామూలు సందర్భాల్లో ఇలాంటివి పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కానీ.. విభజన పుణ్యమా అని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా.. ఖర్చుల విషయంలో అందరి చూపులు పడుతున్నాయి. ఓ పక్క నిధుల కోసం కటకటలాడే పరిస్థితుల్లోనూ.. చంద్రబాబు తనకు తానుగా సీఎం హోదాలో ఖర్చులు తగ్గించే విషయంలో తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు ఉంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ఆయన.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరుగుతున్న రిసెప్షన్ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం.. అత్యవసర పనుల కోసం ఖర్చులు చేయటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. అందుకు భిన్నంగా వేడుకులకు హాజరయ్యేందుకు కూడా ప్రత్యేక విమానాల్ని వినియోగించటం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. ఓపక్క ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంటే.. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల్లో షికారు చేయటం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. మరి.. ఈ విషయాన్ని బాబు ఎప్పటికి గుర్తిస్తారో..?