Begin typing your search above and press return to search.

చంద్రబాబు గృహ ప్రవేశం సెప్టెంబరు 25న

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:03 AM GMT
చంద్రబాబు గృహ ప్రవేశం సెప్టెంబరు 25న
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని తన నివాసంలో అడుగు పెట్టేది సెప్టెంబరు 25వ తేదీ అని అధికారులకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఉండవల్లి కరకట్ట మీద లింగమనేని అతిథి గృహం ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అక్టోబరు 22వ తేదీన జరిగే అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.

చంద్రబాబు నివాసం.. ప్రత్యేక ఏర్పాట్లు.. రహదారుల నిర్మాణం తదితరాలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇప్పటికే పూర్తయింది. పనులు పూర్తిస్థాయిలో పూర్తి కాకపోయిన చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇటీవల పనులు పూర్తి కావడంతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఇకనుంచి క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం నివాసం కూడా పూర్తవుతోంది. కృష్ణా నది ఒడ్డున సర్వాంగ సుందరంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇది కూడా పూర్తయితే చంద్రబాబు నివాసం, కార్యాలయాలకు సంబంధించిన పనులన్నీ పూర్తయినట్లే.

లింగమనేని అతిథి గృహం కరకట్ట మీద ఉండడంతో దీనికి భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. దీని ఎంపికకు ముందు నుంచే భద్రతను పటిష్టం చేశారు. ఇప్పుడు రోడ్డు మీదే కాకుండా నదిపైనా కూడా పోలీసులు పహరా కాయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. పోలీసు అధికారులు కూడా దీని భద్రతపై ఒక కన్ను వేసి ఉంచారు.