Begin typing your search above and press return to search.

ఐటీ దాడులతో సీఎం రమేశ్ విలవిల.. సీఎం చంద్రబాబు కళకళ

By:  Tupaki Desk   |   13 Oct 2018 7:51 PM GMT
ఐటీ దాడులతో సీఎం రమేశ్ విలవిల.. సీఎం చంద్రబాబు కళకళ
X
దేన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించినోళ్లు లేరంటారు. ఇప్పుడు తన పార్టీ నేతలు, పార్టీకి డబ్బు పెడుతూ తాము డబ్బు సంపాదించుకుంటున్న నేతలపై జరుగుతున్న ఐటీ దాడులను ఈ ఎన్నికల ముందు ఓట్లుగా ఎలా మలుచుకోవాలా అనే విషయంలో చంద్రబాబు పక్కా స్కెచ్ గీస్తునట్లు చెబుతున్నారు. దీన్ని అడ్డంపెట్టుకుని ప్రజల నుంచి సానుభూతి పొందడమే లక్ష్యంగా టీడీపీ ప్రణాళిక రచిస్తోందట. ఈ దాడులతో సీఎం రమేశ్ గతి ఏమైనా కూడా టీడీపీ దశ మాత్రం మార్చాలని ప్లాన్ చేస్తున్నారట.

కేంద్రం నుంచి ఏపీకి సాయం సరిగా అందకపోవడంతో జనంలోనూ అసంతృప్తి ఉంది. దాన్ని చంద్రబాబు ఇప్పటికే రగిలించారు. ఇప్పుడు రాజధాని కోసం, కొత్త రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడుతుంటే కేంద్రం తమను వేధిస్తోందన్న రంగును ఈ ఐటీ దాడులకు పులిమేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు, ట్వీట్లు, సోషల్ పోస్టులతో ఈ యాంగిల్‌ను జనంలోకి తీసుకెళ్తున్నారు.

ఇదంతా కక్షసాధింపు చర్యలని బాబు అండ్ కో జనాలను మాయచేసే ప్రయత్నం ప్రారంభించింది. అర్బన్ ఓటర్లు ఈ మాయకు పడరని తెలిసినా గ్రామీణ ప్రాంతాల్లో కిందిస్థాయి నేతలు, కార్యకర్తల ద్వారా దీన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరిని ఏపీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడిని యోధుడిగా... సీఎం రమేశ్‌ను కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష చేసిన నిబద్ధుడిగా చూపుతూ వారిపై కేంద్రం కక్ష కట్టిందని.. ఆ తరువాత చంద్రబాబును కూడా ఏమైనా చేసినా చేయొచ్చంటూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ వ్యవహారం చూస్తుంటే ఈ ఐటీ దాడులతో వారు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లున్నారు.