Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలను చూసి బాబు ముచ్చటపడిన వేళ!

By:  Tupaki Desk   |   5 Oct 2016 8:20 AM GMT
ఎమ్మెల్యేలను చూసి బాబు ముచ్చటపడిన వేళ!
X
చంద్రబాబుతో మీటింగంటే అధికారులకే కాదు ఆయన కేబినెట్లోని మంత్రులకూ గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. సాదాసీదా ఎమ్మెల్యేలయితే మరింత వణుకుతారు. ఎప్పుడు ఏ కారణంతో చీవాట్లు పెడతారో అన్న టెన్షన్ వారిది. ఆయన ఆలోచనలను - వేగాన్ని అందుకోలేకపోతున్నారని... సరిగా పనిచేయడం లేదని తరచూ మంత్రులు - ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్షింతలు వేస్తుంటారు. ఆయన ఇచ్చే ర్యాంకింగుల్లో ముందున్నవారికి నో ప్రాబ్లం.. కానీ, వెనుకబడినవారికి మాత్రం తలంటేస్తారు. అలాంటి చంద్రబాబు సడెన్ గా మంత్రులు - ఎమ్మెల్యేలను చూస్తే తనకు ముచ్చటేస్తోందని చెబితే ఎవరికైనా ఆశ్చర్యమే. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు బుధవారం అలాంటి ఆశ్చర్యానికే లోనయ్యారు. అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో మంత్రులు - ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న నాయకత్వ సాధికారత సదస్సు రెండో రోజున వారితో మాట్లాడిన చంద్రబాబు ఇలా ముచ్చటపడ్డారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలకు కంప్యూటర్ ల్యాబ్ లో సీఎం డ్యాష్ బోర్డు - కైజాలా యాప్ పై శిక్షణ ఇచ్చారు. నాయకులు అలా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులుగా మారి పాఠాలు నేర్చకోవడాన్ని చూసి చంద్రబాబు తెగ ముచ్చటపడిపోయారు.. ఆ ఆనందాన్ని వారితోనే పంచుకున్నారు. వర్శిటీలోని టెక్ విద్యార్థులు చెబుతుంటే, నేతలంతా బుద్ధిగా వింటుండటం - తమకు వచ్చిన అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన చంద్రబాబు - టెక్నాలజీ పరంగా ముందుంటే ప్రపంచం మొత్తం మన ముందున్నట్టేనని అంటూనే తన పార్టీ నేతలకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో విజయం సాధించానని చెబుతూ ఎప్పటిలాగానే దాన్ని కూడా తన విజయాల ఖాతాలో వేసుకున్నారు.

ఎవరైనా సరే అప్ డేట్ కాకుంటే అవుట్ డేట్ అయిపోతారని హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు నడుస్తున్న కాలంలో నూతన ఆవిష్కరణలదే ప్రధాన భూమికని, ఒక ఆలోచన ప్రపంచగతిని మార్చేస్తుందని అన్నారు భూగర్భంలో వేస్తే రూ. 3 వేల కోట్ల ఖర్చయ్యే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును - తనకొచ్చిన చిన్న ఆలోచనతో విద్యుత్ స్తంభాలపై వేయించి రూ. 300 కోట్లతో ముగించేశామని తెలిపారు. రెయిన్ గన్ లను తీసుకువచ్చి - ఎండిపోయే పంటలకు తడులు అందించామని కూడా చెప్పారు. మొత్తానికి శిక్షణ కార్యక్రమానికి చంద్రబాబు రాగానే ఏం వంక పెట్టి క్లాసు పీకుతారో అని భయపడుతున్న ఎమ్మెల్యేలకు ఆయన నాలుగు మంచి మాటలతో సంతోషింపజేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/