Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిలో పదేళ్ల పాటు ఉచిత వైద్యం

By:  Tupaki Desk   |   13 May 2016 10:38 AM GMT
ఏపీ రాజధానిలో పదేళ్ల పాటు ఉచిత వైద్యం
X
ఏపీ నూతన రాజధాని ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వారి ఆరోగ్యానికి పూర్తి రక్షణ కల్పించబోతోంది. సీఆర్‌ డీఏ చట్టం ప్రకారం రాజ‌ధాని న‌గ‌రంలో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు ప‌దేళ్ల‌పాటు ఉచిత వైద్యం అందించ‌నుంది. గ‌త ఏడాది డిసెంబర్‌ 8వ తేదీకి ముందు నుంచి అక్క‌డ నివ‌సిస్తోన్న ప్ర‌జ‌ల‌కు ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ మేర‌కు ఏపీ మెడిక‌ల్‌ అండ్ హెల్త్ డిపార్ట్‌ మెంట్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పూనం మాల‌కొండ‌య్య ఇప్ప‌టికే ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలుపు - గులాబీ రంగు రేష‌న్ కార్డులు క‌లిగి ఉన్న రాజ‌ధాని వాసులకు ఎన్టీఆర్ హెల్త్ స‌ర్వీస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఈ సేవ‌ల‌ను ఉచితంగా పొందొచ్చు. ఈ ప‌థ‌కంతో ఏ చికిత్స‌న‌యినా ప్రభుత్వ - కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఫ్రీయే.

దీనిప్రకారం దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.5లక్షల వరకు అవసరమైన వైద్య సౌకర్యం అందుతుంది. ఈ పథకంలో దాదాపు 1100 వరకూ శస్త్రచికిత్సల్ని అందించనున్నారు. బాబు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం రాజధాని ప్రాంత పరిధిలో నివసించే పేదలకు నిజంగా శ్రీరామరక్షే అని చెప్పాలి. రాజధాని కోసం ప్రభుత్వం భూములు లాక్కుని ప్రజలను ఇబ్బంది పెడుతోందంటూ జరుగుతున్న ప్రచారంతో రాజధాని ప్రాంతంలోని కొన్నివర్గాల్లో అసంతృప్తులు ఏర్పడిన తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో కొత్త విశ్వాసం కలిగేలా చేసింది.