Begin typing your search above and press return to search.

బాబు హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్ లో పొర‌పాటు!

By:  Tupaki Desk   |   13 Oct 2018 5:22 AM GMT
బాబు హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్ లో పొర‌పాటు!
X
అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వ్య‌క్తులు ప్ర‌యాణించే హెలికాఫ్ట‌ర్ల‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఎంత‌లా ఉండాలో దివంగ‌త మ‌హానేత వైఎస్ దుర్మ‌రణ ఘ‌ట‌న పెద్ద పాఠాన్నే నేర్పింది. తాజాగా ఉత్త‌రాంధ్ర‌పై విరుచుకుప‌డిన తిత‌లీ తుఫాను దెబ్బ‌కు అత‌లాకుత‌ల‌మైన సిక్కోలు జిల్లాను ప‌రిశీలించేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హెలికాఫ్ట‌ర్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న ఒక‌టి పోలీసు అధికారుల్ని ఉరుకులు ప‌రుగులు పెట్టేలా చేసింది.
హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్ విష‌యంలో పొర‌పాటు జ‌ర‌గ‌టం ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ముఖ్య‌మంత్రి స్థాయి నేత ఒక‌రు హెలికాఫ్ట‌ర్ లో ల్యాండ్ అవుతున్నారంటూ చుట్టూ ఉండే హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఒక‌వేళ పొర‌పాటున ల్యాండింగ్ చేస్తున్నా.. చుట్టూ హ‌డావుడి లేకుండా ఉండ‌టాన్ని చూసైనా.. ల్యాండింగ్ ను మ‌రోసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తాజా బాబు ప‌ర్య‌ట‌న‌లో అలాంటి లాజిక్ మిస్ కావ‌టం విస్మ‌యానికి గురి చేస్తోంది. ఉత్త‌రాంధ్ర‌ను అత‌లాకుత‌లం చేసిన తిత‌లీ తుఫాను తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు హెలికాఫ్ట‌ర్ లో బ‌య‌లుదేరిన ఏపీ సీఎం చంద్ర‌బాబు శ్రీ‌కాకుళం నుంచి ఇచ్చాపురం.. ప‌లాసల‌లో ప‌ర్య‌టించారు.

అక్క‌డ ఆయ‌న ప‌లాస ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల వ‌ద్ద ల్యాండ్ కావాలి. హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అంద‌రూ చూస్తుండ‌గానే బాబు ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ వ‌చ్చింది కానీ.. ల్యాండింగ్ మాత్రం ఏర్పాట్లు చేసిన ప్రాంతానికి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డీఎస్పీ కార్యాల‌యం వ‌ద్ద ల్యాండ్ అయ్యింది. దీంతో.. పోలీసులు.. రెవెన్యూ అధికారులు ఉరుకులు ప‌రుగులు దీస్తూ.. హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్ ప్రాంతానికి చేరుకున్నారు.

ముందుగా నిర్ణ‌యించిన ప్రాంతంలోకాకుండా డీఎస్పీ కార్యాల‌యంలోని హెలిప్యాడ్ లో ఎందుకు ల్యాండ్ అయ్యింద‌న్న విష‌యంపై ఆరా తీయ‌గా.. ల్యాండింగ్ పాయింట్ పైలట్‌కు క‌నిపించ‌క‌పోవ‌టంతో డీఎస్పీ కార్యాల‌యంలో దించిన‌ట్లుగా చెప్పారు.

ఊహించ‌ని విధంగా హెలికాఫ్ట‌ర్ ల్యాండింగ్ పాయింట్ మార‌టంతో పోలీసులు ఉరుకులు ప‌రుగుల మీద హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయిన డీఎస్పీ కార్యాల‌యానికి వెళ్లారు. బాబు హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అవుతున్న విష‌యాన్ని గుర్తించిన డీఎస్పీ కార్యాల‌య సిబ్బంది ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఎంట్ర‌న్స్ గేటును మూసేశారు. అయినా.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌యాణించే హెలికాఫ్ట‌ర్ ను దింపాల్సిన చోటులో కాకుండా వేరే చోట దింప‌టాన్ని సీరియ‌స్ గా తీసుకొని అంత‌ర్గ‌త విచార‌ణ చేయించ‌టం మంచిద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.