Begin typing your search above and press return to search.

సీమాంధ్రులే కాదు..తెలంగాణ వారూ వస్తున్నారు

By:  Tupaki Desk   |   4 Nov 2015 4:02 AM GMT
సీమాంధ్రులే కాదు..తెలంగాణ వారూ వస్తున్నారు
X
రాష్ట్రం విడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చేశారు. అంటే. ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలు.. తమ సమస్యలు చెప్పుకోవటానికి ఆ రాష్ట్రానికి వెళ్లాలి. కానీ.. అందుకు భిన్నమైన సీన్ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి సీమాంధ్రులతో పాటు.. తెలంగాణ ప్రజలు కూడా సందర్శకులుగా బెజవాడ వస్తున్నారు.

తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవటానికి.. సాయం అర్ధించటానికి వారు విజయవాడకు వస్తున్నారు. కొద్ది నెలలుగా చంద్రబాబు బెజవాడలోనే మకాం వేయటం తెలిసిందే. దీంతో.. సాయం కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడే చూసుకుంటే చంద్రబాబును కలవటానికి వచ్చిన సందర్శకుల్లో ఏపీ ప్రజలతో పాటు..తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి నుంచి దేవరపల్లి నరసింహరావు అనే నిరుపేద సీఎం చంద్రబాబును కలిశారు. సాయం చేయాలని అర్థించారు. దీంతో స్పందించిన చంద్రబాబు ఆయనకు రూ.15వేలు మంజూరు చేశారు. ఇక.. ఏపీ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన సువర్చలా దేవి ఛాతీ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. ఆమె చికిత్సకు రూ.2లక్షలు ప్రకటించారు. ఇదే విధంగా పలువురికి సాయాన్ని అందించారు. విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చి సాయాన్ని అర్థించటం విశేషంగా చెబుతున్నారు.