Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ ని హైజాక్ చేసిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   2 March 2019 6:50 PM IST
రాహుల్ గాంధీ ని హైజాక్ చేసిన చంద్రబాబు!
X
టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్యూహాలు ర‌చించ‌డంలోనే కాదు.. వాటిని అమ‌లు చేయ‌డంలోనే దిట్టే. పోల్ మేనేజ్ మెంట్ తో పాటు ఇత‌ర రాజ‌కీయ పార్టీల వ్యూహాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌డంలో చంద్రబాబు దిట్టేన‌ని చెప్పాలి. త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలను ప్ర‌భావితం చేయ‌డం వ‌ర‌కైతే ఓకేగానీ... తాను క‌లిసి సాగే పార్టీల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌డంలోనూ చంద్రబాబు దిట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల్లో ఏనాడూ ఒంట‌రిగా బ‌రిలోకి దిగి గెలుపు సాధించ‌ని చంద్ర‌బాబు... తాను గెలిచిన ప్ర‌తిసారి ఓడిన ప్ర‌తిసారి కూడా చంద్ర‌బాబు ఎవ‌రితోనే ఒక‌రితో పొత్తు లేకుండా సాగిన దాఖ‌లా లేదు క‌దా. అయితే ఇప్పుడు త‌నతో క‌లిసి సాగే పార్టీలు ఏవ‌న్న విష‌యం తేల్చుకోలేక చంద్రబాబు స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ బాబు త‌న‌దైన మంత్రాంగం నెర‌పుతున్నారు. ఈ మంత్రాంగం దెబ్బ‌కు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా హైజాక్ అయిపోయార‌న్న కొత్త వాద‌న ఇప్పుడు వైరల్‌ గా మారిపోయింది.

అయినా జాతీయ పార్టీల అడుగు జాడ‌ల్లో న‌డిచే ప్రాంతీయ పార్టీల‌ను చూశాం గానీ... ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ బాట‌లో ఇప్పుడు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ న‌డుస్తోంది. దీనికంత‌టికీ చంద్రబాబు త‌ర‌హా చ‌తుర‌తే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి పోటీగా బ‌రిలోకి దిగేది ఎవ‌రు? ఇంకెవ‌రు కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా ఉన్న రాహుల్ గాంధీనే క‌దా. అంటే... జాతీయ స్థాయిలో మోదీ వ‌ర్సెస్ రాహుల్ అన్న భావ‌నే విన‌ప‌డాలి క‌దా. మ‌రి అందుకు భిన్నంగా ఇప్పుడు మోదీ వ‌ర్సెస్ చంద్ర‌బాబు అని ఎందుకు వినిపిస్తోంది? అంటే... చంద్ర‌బాబు చ‌తుర‌తే దానికి కార‌ణ‌మని చెప్పాలి. ఎన్డీఏకు వ్య‌తిరేకంగా యూపీఏ త‌న పేరును సైతం మార్చేసుకునేందుకు కూడా రాహుల్ త‌లూపేశార‌న్న విష‌యం తెలిసిందే క‌దా. ఫ‌లితంగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఎన్డీఏకు పోటీగా దిగిన యూపీఏ.. ఇప్పుడు పీపీఏ (పీపుల్స్ ప్రొగ్రెసివ్ ఫ్రంట్‌)గా మారిపోయింది. ఈ క్ర‌మంలో జాతీయ స్థాయిలో ఈ పీపీఏ కూట‌మి మీటింగులు ఎక్క‌డ జ‌రిగినా... చంద్ర‌బాబు త‌ప్ప‌నిస‌రిగా ఉంటున్నారు. అంతేకాదండోయ్‌... ఆ స‌మావేశాల‌ను చంద్రబాబే ఏర్పాటు చేసిన‌విగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంటే... రాహుల్ గాంధీ ఆ స‌మావేశాల‌కు హాజ‌రవుతున్న నేత‌గానే ఉంటున్నారు త‌ప్పించి ఆ స‌మావేశాల‌కు నేతృత్వం వ‌హించ‌డం లేద‌న్న మాట‌. అయినా చంద్ర‌బాబు పిలిస్తే... పీపీఏకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పార్టీలు ఆయా స‌మావేశాల‌కు వ‌స్తాయా? అంటే... అంత సీను లేద‌నే చెప్పాలి. మ‌రి ఆ స‌మావేశాలు జ‌రుగుతూనే ఉన్నాయంటే... వాటికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌ట్లే లెక్క క‌దా. మ‌రి ఈ స‌మావేశాల్లో కీల‌క ప్ర‌సంగాలు గానీ - కీల‌క నిర్ణ‌యాలు గానీ తీసుకుంటున్న నేత‌గా ఎవ‌రు ఫోక‌స్ అవుతున్నారు? వాస్త‌వానికి రాహుల్ గాంధీ పేరు ఇక్క‌డ వినిపించాలి. అయితే చంద్ర‌బాబు మంత్రాంగం పుణ్య‌మా అని రాహుల్ గాంధీ పేరు విన‌బ‌డాల్సిన స్థానంలో చంద్ర‌బాబు పేరు వినిపిస్తోంది. మొత్తంగా త‌న‌దైన వ్యూహంతో చంద్రబాబు... రాహుల్ గాంధీని హైజాక్ చేశార‌న్న మాట‌. అంతేనా... చంద్రబాబు వ్యూహం ఫ‌లితంగా రాహుల్ గాంధీ దెబ్బైపోయార‌న్న మాట‌. మ‌రి ఈ విష‌యాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి.