Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తగ్గిస్తున్న చంద్రబాబు?!

By:  Tupaki Desk   |   14 April 2019 5:58 AM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తగ్గిస్తున్న చంద్రబాబు?!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తీరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా వరకూ టెన్షన్ ను తగ్గిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విశ్వాసమే కనిపిస్తూ ఉన్నా, మరి కొంత టెన్షన్ కూడా ఉంది. విజయం ఖాయమే అనుకుంటున్నా.. ఫలితాలు వచ్చే వరకూ ఎవరికైనా టెన్షనే కదా. అలాంటి పరిస్థితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉంది.

అలా టెన్షన్ లో ఉన్న వారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఊరటను ఇస్తున్నట్టుగా ఉన్నారు. వారి టెన్షన్ ను బాబు తగ్గిస్తున్నట్టుగా ఉన్నారు. అదెలాగో అందరికీ అర్థం అవుతూనే ఉంది.

ఎన్నికలు జరిగిన తీరుపై చంద్రబాబు నాయుడు మండి పడుతూ ఉన్నారు. 'ఇవి అసలు ఎన్నికలే కాదు..' అనేశారు చంద్రబాబు నాయుడు. సాధారణంగా రాజకీయ నేతలు ఇలా మాట్లాడేది ఓటమి ఖరారు అయ్యాకే.. అనేది ప్రముఖంగా వినిపించే విశ్లేషణ.

ఓటమి తప్పదనుకున్పప్పుడే నేతలు అలా మాట్లాడుతూ ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఫలితాలు రాగానే చాలా మంది ఎన్నికల ప్రక్రియను విమర్శిస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి గెలిచారని - ధన ప్రవాహం చేశారని - మందు పోశారని..మోసపూరిత హామీలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టారని..ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం ఇంకా పోలింగ్ పూర్తి కాగానే అలా మాట్లాడటం మొదలుపెట్టారు. పోలింగ్ రోజు తో మొదలుపెడితే.. ఇప్పటి వరకూ ప్రతి రోజూ బాబు అలానే మాట్లాడుతూ ఉన్నారు.

ఈ మాటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రిలీఫ్ గా కనిపిస్తున్నాయి. ఓటమి తప్పదనే బాబు అలా మాట్లాడుతూ ఉన్నారని..బాబు ఆందోళన చెందుతున్న తీరును చూస్తుంటే.. తమ విజయం ఖరారు అయినట్టే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకుంటున్నారు!