Begin typing your search above and press return to search.

టీడీపీ ఆశలన్నీ ఇక ఆ విషయంలోనే!

By:  Tupaki Desk   |   28 March 2019 3:30 PM GMT
టీడీపీ ఆశలన్నీ ఇక ఆ విషయంలోనే!
X
రుణమాపీ నాలుగో విడత - ఐదో విడత డబ్బులు వేయడం - డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పెండింగ్ మొత్తం..అదే సమయంలో అన్నదాతా సుఖీభవకు సంబంధించిన డబ్బులు.. ఇవన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వరసగా జమ చేసే ప్రయత్నంలో ఉందట ప్రభుత్వం. పోలింగ్ పదకొండో తేదీ కాబట్టి..ఒకటో తేదీ నుంచి ఈ డబ్బులను వరసగా జమ చేస్తే పోలింగ్ సమయానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవచ్చు అనే ఆశతో ఉందట తెలుగుదేశం. ఎన్నికల్లో తెలుగుదేశం వ్యతిరేక గాలి బాగా వీస్తోందన్న విశ్లేషణల నేఫథ్యంలో..ఇప్పుడు ఇలా ప్రభుత్వం అధికారికంగా జనాల ఖాతాల్లోకి జమ చేసే మొత్తమే తమను రక్షిస్తోందనే లెక్కవేస్తోందట తెలుగుదేశం పార్టీ.

వీటిని కావాలనే పెండింగ్ పెట్టారనేది బహిరంగ రహస్యం. రుణమాఫీకి సంబంధించి నాలుగు - ఐదో విడతల మొత్తం ఫిబ్రవరిలోనే వేస్తామని ప్రకటించారు. అయితే వేయలేదు. అలా ముందే వేస్తే జనాలు మరిచిపోతారని.. తీరా పోలింగ్ ముందు వేస్తే కొద్దో గొప్పో ఓట్లు పడకపోవా అనేది తెలుగుదేశం ఆశగా కనిపిస్తూ ఉంది. అందుకే ఏప్రిల్ తొలివారంలో డబ్బులు వేస్తారట.

ఇక మోడీ ప్రకటించిన పెట్టుబడి సాయానికి ఏపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు జోడించి వేసే మొత్తం కూడా పోలింగ్ కు ముందే రైతుల ఖాతాల్లోకి వేస్తారట. ఇవి ఫలితాలను ప్రభావితం చేస్తాయనేది తెలుగుదేశం పార్టీ అనుకూలుర విశ్లేషణ.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే వారిని బాగా విసిగించేశారు. గత ఎన్నికల ముందు హామీ అది. నాలుగు - ఐదో విడతల మొత్తం అంటే అది చిన్న మొత్తం ఏమీ కాదు! ఒక్కో రైతుకు ఒక్కో విడత కింద ముప్పై నలభైవేల రూపాయలు పడాల్సి ఉంది.

రెండు విడతల మొత్తం అంటే.. అరవై డెబ్బై వేల రూపాయలు. అంత మొత్తం రైతుల ఖాతాల్లోకి జమ చేయదగిన స్థాయిలో నిధుల కేటాయింపు లేదు అనేది సుస్పష్టం. ఏదో నాలుగైదు వేల రూపాయలు వేస్తారనే మాట వినిపిస్తోంది. రైతుల ఆశలు మొత్తం డబ్బులు పడటం విషయంలో ఉంటే.. జమ అయ్యేది మాత్రం ఏదో నామమాత్రంగా అనే టాక్ వినిపిస్తోంది. తీరా రైతుల ఖాతాల్లోకి జమ అయితే కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందో చెప్పడానికి లేదు.

ఇప్పటికే ఓటు విషయంలో ప్రజలు ఫిక్సయిపోయి ఉంటారని.. ఆఖరి నిమిషంలో డబ్బులకు ప్రభావితం అయ్యే వారి శాతం చాలా చాలా తక్కువ అనే విశ్లేషణలకూ లోటు లేదు. మొత్తానికి ఫలితాలు వస్తే కానీ.. ఈ పందేరం ప్రభావం ఎంతో క్లారిటీ రాదు!