Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు విజ‌య ర‌హ‌స్య‌మిదేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:30 AM GMT
చంద్ర‌బాబు విజ‌య ర‌హ‌స్య‌మిదేనా?
X
బాబు విజ‌య ర‌హ‌స్యం ఏంటి.... ఎన్నిక ఏద‌యినా...బాబు ఎలా గెలుస్తున్నాడు? ఇదే విప‌క్షాల నేత‌ల‌కు అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌....రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు మ‌ర్మం ద‌క్క‌ని మాయ‌. ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన‌ ఏ ఎన్నిక అయినా ఈ అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. `చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం నుంచి మొద‌లు...``అనే అంత‌టి లోతైన ఎపిసోడ్‌లోకి పోకుండా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాతి ప‌రిణామాల‌ను గ‌మ‌నించినా ఇది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌నే చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్ర ఇరకాటంలో ప‌డిపోయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు రెండు రాష్ర్టాల్లో స‌మ‌న్వ‌యం చేయ‌లేక చ‌తికిల ప‌డిపోతార‌ని భావించారు. అప్పుడు వ‌చ్చిన అంచ‌నాలు - స‌ర్వేలు - విశ్లేష‌ణ‌లు అన్నీ కూడా....బాబు భ‌విష్య‌త్తు...మ‌ళ్లీ విప‌క్ష నేత‌గానే ఉంటుంద‌ని తేల్చేశాయి.

కానీ చంద్ర‌బాబు చ‌క్రం తిప్పాడు! దాదాపు వారం రోజుల వ్యవధిలోనే ప‌రిస్థితిని త‌న‌కు అనుగుణంగా మార్చేసుకున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి విజ‌యంపై అప్ప‌టికే ధీమాతో ఉంటే.....బాబు మాత్రం ప్ర‌ణాళిక‌ల్లో ప‌డిపోయాడు. సామదాన‌బేధ‌దండోపాయాలు ఉప‌యోగించాడు...చావో రేవో అన్న‌ట్లుగా త‌ల‌బ‌డి తెలుగుదేశం పార్టీకి ప‌దేళ్ల ప్ర‌తిప‌క్ష హోదా నుంచి విముక్తి క‌లిగించాడు. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం విశ్లేష‌కుల వంతు అయింది! ఇక తాజాగా వ‌చ్చిన నంద్యాల ఉప ఎన్నిక‌ల ప‌రిణామం చూసినా ఇదే ప‌రిస్థితి. ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మ‌యింది మొదలు...త‌ట‌స్థులను ఎవ‌రిని అడిగినా...విప‌క్షానిదే విజ‌య‌మ‌నే వారు! పార్టీ ఫిరాయింపు... ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక‌త‌..వంటివి క‌లిసి వ‌చ్చి సైకిల్ పార్టీ చ‌తికిల ప‌డుతుంద‌నే జోస్యమే వినిపించింది!! కానీ సీఎం చంద్ర‌బాబు దీన్ని కూడా త‌న‌దైన శైలిలో మార్చేశాడు. నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలుపును త‌న ఖాతాలో చేర్చుకున్నాడు.

ఇలాంటి ప‌రిణామాలు చూస్తుంటే....అస‌లు బాబు ఎలా గెలుస్తున్నాడు? అనేది ఒక ఆస‌క్తిక‌ర‌మైన‌ - చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశం. రాజ‌కీయాల్లో ఎత్తులు...పై ఎత్తులు అనేవి అత్యంత స‌హ‌జం కాబ‌ట్టి వాటిని అలా ప‌క్క‌న పెట్టేస్తే...ఏ అంశం బాబును గెలిపిస్తుంద‌నేది ఇక్క‌డ కీల‌క‌మైన పాయింట్‌. దీనికి స‌మాధానం...బాబు మార్క్ మేనేజ్‌ మెంట్‌! అలా అని అదేదో పెద్ద బ్ర‌హ్మ‌పదార్థం కూడా కాదు. చాలా సింపుల్‌. త‌న ముందున్న ల‌క్ష్యం ఏంటి? త‌న బ‌లాలు ఏంటి? బ‌ల‌హీన‌త‌లు ఏంటి? వాటిని ఎదుర్కోవ‌డం ఎలా? ప్రత్య‌ర్థి బ‌లం ఏంటి....బ‌ల‌హీన‌త‌లు ఏంటి....ఏ పాయింట్ ఆధారంగా దెబ్బ‌కొడితే...ప్ర‌త్య‌ర్థి విల‌విల‌లాడిపోతాడు...త‌న‌కు విజ‌యం ద‌క్కుతుంది...ఇంతే. ఇవే బాబు వేసుకునే సింపుల్ లెక్క‌లు. ఈ స్కెచ్‌ ను ప‌క్కాగా అమ‌లు చేసే స‌మ‌యంలో బాబు జాగ్ర‌త్త ప‌డుతుంటారు. అంతా త‌న‌కే తెలుస‌నే భావ‌న‌ను అస్స‌లు ప్ర‌ద‌ర్శించ‌రు. స‌ద‌రు టార్గెట్‌కు అర్హుల‌తో చ‌ర్చించి ప్ర‌ణాళిక‌కు మ‌రింత ప‌దును పెడ‌తారు. పార్టీ నేత‌ల‌ను ఎవ‌రిని - ఎక్క‌డ‌ - ఎలా వాడుకోవాలో అలా ప‌క్క‌గా ప్లాన్ చేసేస్తారు. ప్ర‌జ‌ల‌తో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎక్క‌డ మాట్లాడాలి....వంటివి దీనికి అధ‌నం.

అయితే...ఇవేవీ పైకి క‌నిపించ‌వు. అస‌లు ఇంత ప్రాసెస్ ఒక‌టి జ‌రుగుతోంద‌ని...దానికి చంద్ర‌బాబు దిశానిర్దేశనం చేస్తున్నార‌ని కూడా ఎక్క‌డా హ‌డావుడి ఉండ‌దు. పైగా ఈ ప్ర‌ణాళిక‌లు అమ‌ల‌వుతున్నాయ‌ని...త‌మ‌దే విజ‌య‌మ‌ని మేక‌పోతు గాంభీర్యం కూడా బాబులో క‌నిపించ‌దు. ఆ టాస్క్ అలా సాగిపోతుంది. చివ‌రికి ఫ‌లితం మాత్రం క‌నిపిస్తుంది. దాని వెనుకే....చిరున‌వ్వుతో...బాబు కూడా క‌నిపిస్తాడు!

నంద్యాల గెలుపు బాబు మార్క్ ప్లానింగ్‌లో ప్ర‌త్యేక‌మ‌ని అంటున్నారు. చంద్రబాబునాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిన తర్వాత ప్రజలలో ఆయన బలపడ్డారా? బలహీనపడ్డారా? అన్నది తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడ్డాయి. ఎందుకంటే...ఇది కేవ‌లం ఉప ఎన్నిక‌గానే చూడ‌టం కాదు...అంత‌కుమించి కూడా! ఎందుకంటే.. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం గెలుచుకున్న నంద్యాలలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత 27,466ఓట్లతో గెలవడం ఆషామాషీ కాదు. నంద్యాలలోని మొత్తం రెండు లక్షల పైచిలుకు ఓటర్లలో లక్షా 20 వేల ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నవారే! ఈ కారణంగానే నంద్యాలలో గెలుపు పట్ల తెలుగుదేశం నాయకులకే నమ్మకం లేకుండా పోయింది...అలాంటి ప‌రిస్థ‌ఙ‌తుల్లో బాబు రంగంలోకి దిగి త‌న పార్టీనికి గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో బాబు మ‌రో సందేశం కూడా పంపారు. 2014 ఎన్నికలలో బీజేపీ - పవన్‌ కల్యాణ్‌ ల మద్దతు కారణంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్న అభిప్రాయం చాలా మందిలో ఉండింది. నంద్యాల ఫలితం తర్వాత ఈ అభిప్రాయం వాస్తవం కాదని స్పష్టమైంది. బీజేపీ - పవన్‌ కల్యాణ్‌ మద్దతు లేకుండానే నంద్యాలను భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. త‌ద్వారా టీడీపీ బ‌ల‌మేంటో...బాబు మార్క్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో... తెలియ‌జెప్పిన‌ట్ల‌యింది. మ‌రోవైపు ఏపీలో తాము చాలా బలపడిపోయామని బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు భావిస్తూ వస్తుండ‌గా..వారికి సైతం `స్ప‌ష్ట‌త‌` ఇచ్చిన‌ట్లయింది.

ఇక ఇదే కోవ‌లోకి కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక‌ను కూడా చేర్చుకోవ‌చ్చు. ఒక కార్పొరేష‌న్ ఎన్నిక‌ను...ముఖ్య‌మంత్రి ఖాతాలో చేర్చ‌డం స‌బ‌బా? అనే సందేహం ఉండ‌వ‌చ్చు...కానీ ఈ పోరు సాగిన తీరు చూస్తే...స‌బ‌బ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే...30 ఏళ్ల నుంచి కాకినాడ నగర పాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అలాంటి స‌మ‌యంలో బాబు పార్టీ గెలిచింది. అంతేకాదు...తెలుగుదేశం– వైసీపీ మధ్య ఓట్ల‌ వ్యత్యాసం దాదాపు 16 శాతం ఉంది. అందుకే ఈ విజ‌యాన్ని బాబు ఖాతాలో చేర్చాల‌ని అంటున్నారు. మ‌రోవైపు ఇటీవ‌లి కాలంలో చంద్ర‌బాబుకు పంటికింద రాయిలాగా మారిన కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌భావంపై గ‌ణ‌నీయ‌మైన అంచ‌నాలు వెలువ‌డ్డాయి. కాకినాడ పట్టణంలో కాపులు గణనీయంగా ఉన్నందున‌...దాదాపు 15 డివిజన్‌ లలో ఫలితాలను ప్రభావితం చేయగలర‌ని భావించారు. అయితే అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ 15 డివిజన్‌ లలో పది తెలుగుదేశం– బీజేపీ ఖాతాలో పడగా, వైసీపీకి అయిదు మాత్రమే దక్కాయి. కాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభంను ఆయ‌న ఇలాకాలో సైడ్ చేసి బాబు సైకిల్ దూసుకుపోయింది.

ఇలా `స‌క్సెస్ మంత్రా`న్ని ఒడిసిప‌ట్టుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు బాబు మ‌దిలో ఉన్న మ‌రో భావ‌న కూడా ఉంద‌ని అంంటున్నారు. అదే...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఈ ఫలితాలు ఆయనపై ఉన్న బాధ్యతను మరింత పెంచడం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మూడేళ్ల తర్వాత కూడా ఆయనపై ఉన్న నమ్మకం చెదరలేదని రుజువైనందున వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే బాబు ఈ విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు కాబ‌ట్టే...నాపై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని స్వ‌యంగా ఈ మాట చంద్ర‌బాబు చెప్పేశారు! ఈ దీర్గ‌కాల వ్యూహ‌మే బాబును గెలిపిస్తుంద‌ని తేల్చిచెప్తున్నారు.

ఈ వ్యూహాల‌కు తోడుగా బాబు అమ్ముల పొదిలో మ‌రిన్ని అస్త్రాలు కూడా ఉండటం బాబు `సిరీస్ ఆఫ్ స‌క్సెస్‌`ల‌కు కార‌ణ‌మ‌ని తెలుగుదేశం పార్టీని ద‌గ్గరగా చూసిన నేత‌లు చెప్తుంటారు. ప‌టిష్ట‌మైన పార్టీ నిర్మాణం క‌లిగి ఉన్న టీడీపీకి సంబంధించిన ప్ర‌తి వ్య‌వహారం అలా...అలా....ఏదోలా...జ‌రిగిపోవ‌డం అంటూ ఉండ‌దు. ప్ర‌తి దానికి ఓ క‌మిటీ ఉంటుంది. గ్రామ‌ - మండ‌ల‌ - జిల్లా - రాష్ట్ర స్థాయి క‌మిటీ...ఇలా ద‌శ‌ల వారీగా దిశానిర్దేశం చేసే...కార్యాచ‌ర‌ణ‌లో పాలుపంచుకునే నాయ‌కులు ఉంటారు. పార్టీ అధిష్టానం ఇచ్చే ప్ర‌తి సూచ‌న‌ను ఫాలో అవ‌డం.... అదే విధంగా అవ‌స‌ర‌మైన ఫీడ్ బ్యాక్‌ను ఇవ్వ‌డం ఈ క‌మిటీల‌ విధి. అందుకే బాబు వేసే స్కెచ్ ప‌క్కాగా స‌క్సెస్ అయి ఫ‌లితం ఇస్తుంటుంది.

ఇక మ‌రో అంశం, కీల‌క అంశం. మీడియా...టీడీపీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశం ఇదే. అంటే మీడియాతో లాభ‌ప‌డటం అని మాత్ర‌మే కాదు...మీడియాలో ఏఏ అంశాలు ప్ర‌సారం అవుతున్నాయో అవ‌న్నీ `టీడీపీ నాలెడ్జ్ సెంట‌ర్‌`లో రికార్డు అవుతుంటాయి. దాదాపుగా ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ల‌కు సంబంధించిన 24 గంట‌ల స‌మాచారం అంతా....టీడీపీ నాలెడ్జ్ సెంట‌ర్ పూర్తిగా రికార్డ్ చేస్తుంటుంది. దీనికి తోడుగా పత్రిక‌ల్లో వ‌చ్చే ప్ర‌తి ముఖ్య‌మైన‌ వార్తాంశం టీడీపీ నేత‌ల లైబ్ర‌రీలో భ‌ద్రంగా ఉంటుంది. ఏదో పేప‌ర్లు తీసి పక్క‌న పెట్టేయ‌డం కాకుండా... అంశాల వారీగా వీటిని క్రోడీక‌రిస్తుంటారు...వాటికి వ‌చ్చిన స్పంద‌న‌ల‌ను కూడా జ‌త‌ప‌రుస్తుంటారు. అంతేకాకుండా నాయ‌కుల ప‌రంగా చూసినా టీడీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. ఏ విష‌యంపై ఏ నాయ‌కుడు టీవీల‌లో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడ‌కూడ‌దు....ఏ ఛాన‌ల్‌కు డిస్క‌ష‌న్‌ కు వెళ్లాలి? సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఎలా `మేనేజ్‌` చేయాలి...అనేవి టీడీపీ సీనియ‌ర్లు చ‌ర్చ‌ల్లో పాల్గొనే నాయ‌కుల‌కు హిత‌బోధ చేస్తుంటారు. వీట‌న్నింటికీ మించి చ‌ర్చ‌ల‌కు వెళ్లే జాబితాను పూర్తిగా చంద్ర‌బాబు స్కాన్ చేస్తుంటారు. త‌ద్వారా టీడీపీ వాణి బ‌లంగా, ఎలాంటి తేడా లేకుండా వినిపిస్తుంది.

ఇలా త‌న అస్త్రాల‌ను ఇలా పూర్తిగా స‌మాయ‌త్తం చేసుకునే సీఎం చంద్ర‌బాబు విపక్షాల‌పై కూడా ఓ క‌న్నేసి పెడుతుంటారు. విపక్షం బ‌లాలు...బల‌హీన‌త‌లు ఏంటి? ప్ర‌తిప‌క్ష‌ పార్టీల్లో కుమ్ములాట‌లు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎవ‌రిని ఎవ‌రు టార్గెట్ చేసేలా ఉన్నాయి? ఆయా పార్టీల నేత‌ల్లో అస‌మ్మ‌తి నాయ‌కులు ఎవ‌రు? వారి బ‌లం ఏంటి బ‌ల‌హీన‌త ఏంటి? ఎన్నిక‌లు లేదా ఇంకేదైనా అవ‌స‌రం ప‌డితే వారిని టీడీపీ గూటికి చేర్చుకోవ‌డానికి ఏం చేయాలి? ఎక్క‌డ స్విచ్చ్ నొక్కితే....సరైన చోట బ‌ల్బు వెలుగుతుంది వంటివ‌న్నీ ఓ కంట క‌నిపెడుతూ ఉంటారు.

ఇలా నిరంతర మ‌థ‌నం అనేది టీడీపీలో త‌నంత‌తానుగా జ‌రిగిపోతుంటుంది. విజేత ఎప్పుడూ త‌దుప‌రి అడుగే కాకుండా...ప‌ది అడుగుల త‌ర్వాతి ల‌క్ష్యాన్ని కూడా ఊహిస్తూ ఉంటాడ‌న్న‌ట్లు...బాబు `విజ‌న్‌`తో అడుగేస్తూ ఉంటాడు. ఆ అడుగు వెన‌క‌డుగు కాకుండా...జాగ్ర‌త్తప‌డుతుంటారు. అందుకే ఆయ‌న‌కు గెలుపు `న‌ల్లేరు మీద న‌డ‌క` అవుతుంది. ప్ర‌తి విజ‌యం వెనుక బాబు చిరు ద‌ర‌హాసం ఉంటుంది.