Begin typing your search above and press return to search.

కుప్పంపై బాగా పట్టుదలగా బాబు

By:  Tupaki Desk   |   9 Jan 2022 6:50 AM GMT
కుప్పంపై బాగా పట్టుదలగా బాబు
X
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటమనే సామెత చంద్రబాబునాయుడుకు బాగా అతుకుతుంది. స్ధానికసంస్ధల ఎన్నికలకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇపుడు నేతలపై మండిపడుతున్నారు. పరువుపోయిందంటున్నారు. నమ్మినవాళ్ళు నట్టేట ముంచారని గోల చేస్తున్నారు. 35 ఏళ్ళు పాత మొహాలే తీప్ప కొత్త ముఖాలు ఎందుకు కనబడటంలేదంటు మండిపోతున్నారు. కోవర్టులను ఏరేస్తానని, పార్టీని ప్రక్షాళన చేస్తానని ఇపుడు చెబుతున్నారు.

చంద్రబాబు ఇపుడు చెప్పినవన్నీ ద్వితీయ శ్రేణి నేతలు చాలా సంవత్సరాలుగా చెబుతున్నా పట్టించుకోలేదు. నియోజకవర్గంలో కొందరు కీలకనేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. ఈ విషయాలను చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఐదారుమంది నేతలే మొత్తం నియోజకవర్గాన్ని సాశిస్తున్నారని, ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ ను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు.

చంద్రబాబుపై ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లోనే కాదు జనాల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరించినా లెక్కచేయలేదు. దాని ఫలితం మొన్నటి ఎన్నికల మొదటి రెండు రౌండ్లలోనే కనబడింది. నియోజకవర్గాన్ని ఐదారుమందికి అప్పగించేసి చంద్రబాబు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. వచ్చిన అవకాశంతో వాళ్ళు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దాని ఫలితమే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కనబడింది.

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఐదారుమంది నేతలపై మిగిలిన నేతలు చంద్రబాబు సమక్షంలోనే తీవ్రమైన ఆరోపణలు చేసి కొట్టినంతపని చేశారు. దాంతో వాళ్ళు రాజీనామాలు చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అందరిముందే చంద్రబాబుకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం రాజీనామాలను యాక్సెప్ట్ చేయకుండా మిగిలిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నా మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. దాంతో వాళ్ళు మరింతగ రెచ్చిపోయారు. ఐదారుమందిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోరనే సిగ్నల్స్ వెళ్ళిపోయాయి.

దాంతో కాస్త బలమున్న ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ పార్టీని వదిలేసి వైసీపీలోకి వెళిపోయారు. పార్టీలోనే ఉన్న కొద్దిమంది నేతలు చంద్రబాబు మీద కోపంతోనే వైసీపీకి పనిచేశారు. దాంతో మొత్తం పార్టీ వ్యవస్ధే కుప్పకూలిపోయింది. అంతా అయిపోయినాక ఇపుడు కీలకమైన నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్నికూడా చాలామంది నేతలు నమ్మటంలేదు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతారని కానీ సమయం వచ్చేసరికి మళ్ళీ ఆ ఐదారుమందినే నెత్తినెక్కించుకుంటారని అంటున్నారు. కాబట్టి జరిగిన తప్పులో చంద్రబాబుదే మేజర్ పాత్ర. అంతా అయిపోయిన తర్వాత పరువుపోయిందని ఇపుడు గోల చేయటంలో అర్ధమేలేదు.