Begin typing your search above and press return to search.

రాజధానులపై నేషనల్ మీడియాలో కథనాలు...బాబు మేనేజ్ మెంటేనా?

By:  Tupaki Desk   |   26 Jan 2020 5:30 PM GMT
రాజధానులపై నేషనల్ మీడియాలో కథనాలు...బాబు మేనేజ్ మెంటేనా?
X
నవ్యాంధ్రకు మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా సాగుతున్న వైనాన్ని... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అండ్ కో అడ్డుకునేందుకు ఓ రేంజి వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాజధాని రైతులతో ధర్నాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు... తాను కూడా అందులో పాలుపంచుకుంటూ జగన్ ను నిలువరించే యత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో... ఎలాగైనా ఈ జగన్ దూకుడును దేశవ్యాప్తంగా బదనాం చేసేందుకు బాబు అండ్ కో పక్కా వ్యూహం పన్నినట్టుగానే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా జాతీయ మీడియాలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఏ మేర నష్టం జరుగుతోందన్న విషయాలపై ప్రత్యేక కథనాలు రాయించేస్తోంది. ఇలా బాబు మార్కు వ్యూహానికి బాగానే ఒంగిపోయిన నేషనల్ మీడియా... అసలు విషయమేమిటన్న దానిని పట్టించుకోకుండా బాబు బ్యాచ్ చెప్పినట్టుగానే కథనాలు వండి వారుస్తోంది.

బాబు మార్కు మేనేజ్ మెంట్ ఏ మేర సక్సెస్ అవుతోందన్న విషయం... గడచిన మూడు, నాలుగు రోజుల నేషనల్ మీడియాకు చెందిన పలు ఆంగ్ల దినపత్రికల కథనాలను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. చంద్రబాబు అనుకూల మీడియాగా ముద్రపడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వారం, పక్షం రోజుల క్రితం వండివార్చిన కథనాలనే జాతీయ పత్రికలు కూడా అచ్చేయడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమే. రాష్ట్రానికి రాజధాని నడి మధ్యలో ఉండాలని, అలా కాకుండా ఓ చివర ఉంటే... మరో చివర ఉన్న ప్రాంతాలకు రాజధాని చాలా దూరమైపోతుందని, దూరాభారంతో ఇటు ప్రభుత్వంపైనా, అటు ప్రజల పైనా తీవ్ర భారం పడిపోతుందని జాతీయ పత్రికలు పొంతన లేని కథనాలను అచ్చేశాయి. అయితే అదే సమయంలో దేశానికి రాజదానిగా ఉన్న ఢిల్లీ గానీ, దేశంలోని చాలా రాష్ట్రాల రాజధానులు ఆ రాష్ట్రాలకు ఏదో ఒక చివరే ఉన్న అంశాన్ని మాత్రం ఆ పత్రికలు ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఇక చంద్రబాబు మేనేజ్ మెంట్ కు లొంగిపోయి... జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కథనాలు రాసిన జాతీయ పత్రికలు ఏవన్న విషయానికి వస్తే... ఒకటి ద ఇండియన్ ఎక్స్ ప్రెస్, మరొకటి బిజినెస్ స్టాండర్డ్. ఈ నెల 23వ తేదీన బిజినెస్ట్ స్టాండర్డ్ రాసిన కథనంలో దూరాభారం ప్రధానాస్త్రం కాగా... 24వ తేదీన ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురితమైన కథనంలో కూడా దూరాభారంతో పాటుగా చంద్రబాబు అనుకూల మీడియాలో కథలు కథలుగా వినిపించిన కుల, వర్గ ప్రస్తావనలు ప్రత్యేకంగా కనిపించాయి. అంతేకాకుండా జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులు నష్టమేనని చెప్పడంతో పాటుగా.. రాజధాని రైతులకు ఉపయుక్తంగా ఉండే దిశగా నిర్ణయాలు తీసుకుంటే జగన్ సర్కారుకు మంచిదని కూడా ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు అనుకూల మీడియాలో వచ్చిన కథనాల మాదిరే ఈ కథనాలు ఉండటం... నేషనల్ మీడియాలో కథనాల పేరిట మరోమారు బాబు అనుకూల మీడియా మరోమారు ఇదే వాదనతో ప్రత్యేక కథనాలు ప్రచురించడం నిజంగానే ఆసక్తికరమని చెప్పాలి.