Begin typing your search above and press return to search.

వామ్మో.. నిరసనకూ జపానోడు కావాలా?

By:  Tupaki Desk   |   31 July 2016 5:11 AM GMT
వామ్మో.. నిరసనకూ జపానోడు కావాలా?
X
మనకీ భావదారిద్ర్యం ఏలా? దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఏదో ఒక దేశపోడ్ని చూసి తెలుసుకోవాలి. ఒక వంతెనను నిర్మించిన దానికి మరో దేశపోడ్ని చూడాలి. ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో ఎప్పుడూ వినని దేశాలోళ్లు చేసింది తెలుసుకోవాలి. ఇక.. బట్టలు ఏసుకొనుడు దగ్గర నుంచి మూతికి రాసుకునే లిప్ స్టిక్కులే కాదు.. కింద మార్చుకునే ప్యాంపర్ల వరకూ అన్నీ కాపీలే. అందుకేనేమో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా నిరసనలు సైతం వేరే దేశపోళ్లు చేసే దాన్ని కాపీ కొట్టాలని పిలుపునిస్తున్నారు.

మనకున్న కమిట్ మెంట్లు.. మన రాజకీయ నేతల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని స్వచ్ఛభారత్ అని చెప్పి.. తాను వెళుతున్న దారిలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి.. అక్కడ చీపురు పట్టుకొని ఊడ్చి.. స్వచ్ఛభారత్ అంటూ కార్యక్రమాన్ని షురూ చేయటం.. సెల్ఫీలతో ప్రచారం చేసుకోవటం మొదలెట్టింది సంధి.. ప్రతి ఒక్క సెలబ్రిటీ చీపుర్లు పట్టుకొని రోడ్లు.. పార్కులు.. ఇలా సెల్ఫీలు.. ఫోటోలు తీసుకోవటానికి వీలుగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని కవర్ చేశారు.

ఈ స్వచ్ఛ భారత్ సోకు ఆర్నెల్లు గడిచేసరికి పాతదైపోయింది. ప్రముఖుల సెల్ఫీల సందడి ముగిసిందో లేదో.. టీవీల్లోనూ.. సినిమా హాళ్లలోనూ ఉదరగొట్టేయటమే తప్పించి.. కమిట్ మెంట్ తో శుభ్రం చేసింది లేదు. చివరకు స్వచ్ఛభారత్ పుణ్యమా అని దేశం ఎంత శుభ్రపడిందో ఏమో కానీ.. స్వచ్ఛభారత్ పన్ను మాత్రం దేశంలోని130 కోట్ల మంది మీదా మాత్రం పడింది.

ఇలా.. తమదైన బ్రాండ్ కోసం షురూ చేసే కార్యక్రమాలకే దిక్కు దివాణం లేని ఈ దేశంలో.. నిరసనల్ని జపానోడు మాదిరిగా చేపట్టాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇవ్వటం చూస్తే ఎక్కడో కాలిపోవటం ఖాయం. రాజ్యసభలో తమ వర్గం వారి చేతకాని తనాన్ని దేశం మొత్తం వీక్షించిన వేళ.. జైట్లీ గారి ముక్తాయింపు అనంతరం.. హోదా ఆశలకు సమాధి కన్ఫర్మ్ అయ్యాక.. దాని మీద పడే చిల్లర పైసల కోసం ఒకరు బంద్ కు పిలుపునిస్తే.. మరొకరేమో.. సదరు బంద్ ను ఎలా చేయాలో తెలుసా అంటూ..బంద్ కు పిలుపునిచ్చిన ఆయన పాఠాన్నిసరిదిద్దే ప్రోగ్రాం మొదలెట్టారు. బంద్ అంటే.. దుకాణాలు మూసేసి.. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు.. నిరసన ప్రదర్శనలు కావని.. చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని రోజూ చేసే పని కంటే ఎక్కువగా పని చేయటమని.. రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేసుడు బంద్ చేసి చేత్తో చీపుర్లు పట్టుకొని రోడ్లను ఊడ్చేయాలని.. మురుగు కాల్వల్లో మురుగు తీయాలంటూ పిలుపునిచ్చారు.

ఎందుకిలా అన్నది అడగకుండానే.. నిరసనలో జపానోడ్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ సెలవిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నిరసనకు రోడ్లు ఊడ్చుట.. మురుగు కాల్వలలో మురుగు తీయుట లాంటివి ఫోటోలకు ఫోజులిచ్చే ప్రోగ్రామ్ లే అన్న విషయం చంద్రబాబుకు తెల్వదా? అంటే..ఆయనకు తెలీనది ఏముంటుంది? కాకుంటే.. జగన్ ఇచ్చిన బంద్ పిలుపును తనదైన శైలిలో హైజాక్ చేయటమే కానీ.. హోదా మీద కడుపుమండినోడు ఏం చేయాలో మాత్రం సూటిగా.. స్పష్టంగా మాత్రం చెప్పరు. నిజానికి నిరసనకు జపానోడే ఆదర్శమైతే.. జాతిపిత గాంధీ కూడా బాగా పని చేయండి.. ఇంకా పని చేయండి.. చీపుర్లు పట్టుకొని రోడ్ల మీదకు రండి అని పిలుపునిచ్చే వారుకదా. ఆయనకు ఆయన.. కడుపు మాడ్చుకొని డేరాలేసుకొని నిరాహార దీక్ష ఎందుకు చేసేవారు? ప్రపంచానికే అహింసతో ఉద్యమించి దేశానికి స్వాతంత్య్రాన్ని ఎలా తీసుకురావాలో తెలియజేసిన జాతిలో పుట్టి.. ఇప్పుడీ రోజున నిరసనల్ని ఎలా చేయాలో జపానోడ్ని చూసి నేర్చుకోవాలా?

కొన్ని అంశాలు కొన్ని ప్రాంతాలకు నప్పుతాయి. ఆ చిన్న లాజిక్ మిస్ చేసుకొని.. ప్రతిదీ పక్కనోడి మాదిరి చేయాలనుకోవటం.. ఒకడిని చూసి కాపీ కొట్టాలని చూస్తే.. మనకున్న ఒరిజినాలిటీ పోతుందన్న భావన బాబుకు అనిపించదా? చివరకు నిరసన కూడా.. వేరే దేశపోడ్ని చూసి నేర్చుకోవాల్సిన దుస్థితికి చేరుకున్నట్లున్నాం. హతవిధి.. ఏమిటీ ఖర్మ..?