Begin typing your search above and press return to search.

బాబూ..మ‌హిళా పార్ల‌మెంటు స్ఫూర్తి ఇదేనా?

By:  Tupaki Desk   |   3 April 2017 5:54 AM GMT
బాబూ..మ‌హిళా పార్ల‌మెంటు స్ఫూర్తి ఇదేనా?
X
మొన్న విజ‌య‌వాడ వేదిక‌గా మూడు రోజుల పాటు జ‌రిగిన జాతీయ మహిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుల‌ను టీడీపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న వైనం మ‌న‌కంద‌రికీ తెలిసిందేగా. జాతీయ మహిళా పార్ల‌మెంటు స్ఫూర్తిగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో మ‌హిళ‌ల‌కు మ‌రింత పెద్ద పీట వేయ‌నున్న‌ట్లు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ స‌హా సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఊద‌ర‌గొట్టారు. అయితే ఆ ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ ఒట్టి మాట‌లేన‌ని తేలిపోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. నిన్న జ‌రిగిన ఏపీ కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు తీవ్ర అన్యాయ‌మే జ‌రిగిపోయింది.

నిన్న‌టి కేబినెట్ రీష‌ఫిలింగ్‌ కు ముందు చంద్రబాబు కేబినెట్‌ లో ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉండేవారు. వారిలో ప‌రిటాల సునీత‌ - పీత‌ల సుజాత‌ - కిమిడి మృణాళిలు... పౌర స‌ర‌ఫ‌రాలు - మ‌హిళా సంక్షేమం - గ‌నులు - గృహ నిర్మాణం త‌దిత‌ర శాఖ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ ముగ్గురిలోనూ ఒక్క పీత‌ల సుజాత మిన‌హాయిస్తే... ప‌రిటాల గాని, మృణాళిని గానీ త‌మ శాఖ‌ల నిర్వ‌హ‌ణ‌లో మెరుగ్గానే రాణించారు. ఈ విష‌యాన్ని ఇత‌ర పార్టీల నేత‌లో, లేదంటే ఆయా మంత్రుల కుటుంబ స‌భ్యులో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు టీడీపీ అధిష్ఠానం చెప్పిన మాట‌. మ‌రి నిన్న‌టి కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో మృణాళిని - పీత‌ల సుజాత‌ల‌ను చంద్రబాబు ఒక్క దెబ్బ‌కు త‌ప్పించేశారు. పీత‌ల తొల‌గింపున‌కు అవినీతి ఆరోప‌ణ‌లే కార‌ణ‌మ‌ని చెప్పిన పార్టీ నేత‌లు... మృణాళిని తొల‌గింపున‌కు చెప్పిన కార‌ణం మాత్రం విస్తుగొలుపుతోంది.

శాఖా నిర్వ‌హ‌ణ‌లో మృణాళిని మెరుగ్గానే రాణిస్తున్నా... జిల్లాలో పార్టీకి నాయ‌క‌త్వం వహించే స్థాయికి ఆమె చేరుకోలేక‌పోయార‌ని, అందుకే ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తున్న‌ట్లు మీడియాకు లీకులు ఇచ్చేసింది. అయినా మంత్రిగా ఉన్న‌ది... ప్ర‌భుత్వ శాఖ‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించేందుకే గానీ... జిల్లా పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి కాదుగా. స‌రే... మృణాళినిని కేబినెట్‌ ను నుంచి తొల‌గించినా... ఆమె స‌మీప బంధువు కిమిడి క‌ళా వెంక‌ట్రావుకు కేబినెట్‌ లో బెర్తు ఇచ్చార‌ని స‌ర్ది చెప్పుకుంటే... అస‌లు మ‌హిళా పార్ల‌మెంటు స్ఫూర్తిని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాటిస్తుందా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు వినిపిస్తోంది. త‌న కేబినెట్ నుంచి ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికిన చంద్ర‌బాబు... క‌నీసం అంతే సంఖ్య‌లోనైనా మ‌హిళా ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించాలి క‌దా.

మ‌రి చంద్ర‌బాబు చేసిందేమిటి?... ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను త‌న కేబినెట్ నుంచి త‌ప్పించి... కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే చోటు క‌ల్పించారు. అంటే చంద్ర‌బాబు దృష్టిలో స‌త్తా క‌లిగిన మ‌హిళా ఎమ్మెల్యేలు టీడీపీలో లేర‌నే క‌దా అర్థం. వంగ‌ల‌పూడి అనిత - యామినిబాల‌ - ప్ర‌తిభా భార‌తి లాంటి ఎమ్మెల్యేలు... అందుబాటులోనే ఉన్నారు క‌దా. విప‌క్షం ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో అనిత‌ - యామిని ముందు వ‌రుస‌లో ఉంటూ వ‌స్తుంటే... అసెంబ్లీ స్పీక‌ర్‌ గా గ‌తంలో స‌భ‌ను మెరుగైన రీతిలో న‌డిపార‌న్న సత్తా క‌లిగిన నేత‌గా ప్ర‌తిభా భార‌తి కూడా పేరు తెచ్చుకున్నారు. మ‌రి వీరెవ‌రు కూడా మంత్రి ప‌ద‌వుల‌కు ప‌నికి రార‌నేగా చంద్ర‌బాబు అభిప్రాయం. అంటే... మహిళా పార్ల‌మెంటు స్ఫూర్తిని చంద్ర‌బాబు ఉక్కుపాదంతో అణ‌చివేశార‌న్న వాద‌న‌లో నిజం లేద‌నేందుకు ఆస్కార‌మే లేద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/