Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు బాబు భ‌లే ఫిటింగ్ పెట్టేశాడే

By:  Tupaki Desk   |   2 Oct 2017 1:30 AM GMT
త‌మ్ముళ్ల‌కు బాబు భ‌లే ఫిటింగ్ పెట్టేశాడే
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నేత‌ల‌కు భ‌లే ట్విస్ట్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌లు షెడ్యూల్ కంటే ముందే జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే త‌మ్ముళ్ల‌కు స్ప‌ష్టంగా చెప్పేసిన చంద్ర‌బాబు..ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తులో ఉన్నార‌ని తెలుస్తోంది. అంటే ఎవ‌రెవ‌రెవ‌రికి ఎక్క‌డ టికెట్లు అని కాదు. టికెట్లు కావాలనుకున్న వారికి ష‌ర‌తులు విధించ‌డం. బాబు విధిస్తున్న ఈ ష‌ర‌తుల‌తో త‌మ్ముళ్లు అవాక్క‌వుతున్నార‌ట‌. ఇంత‌కీ ఆ ష‌ర‌తులు ఏంటంటే..., ఇప్పుడు నామినేటెడ్‌ పదవి స్వీకరిస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదు. అలాగే, అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. . దీంతో ప‌ద‌విని తీసుకోవాలా...ష‌ర‌తుల‌ను చూసి వ‌దులుకోవాలా అని ఆలోచ‌నలో ప‌డ్డార‌ని స‌మాచారం.

తెలుగుదేశం పార్టీలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను కొలిక్కి తేవాల‌ని డిసైడ‌య్యారు. ఈసారి నామినేటెడ్‌ పదవులు దక్కేవారికి ముఖ్యమంత్రి కఠిన పరీక్షలే పెడుతున్నారు. పదవి తీసుకోవడమే కాకుండా ఎంపిక చేసిన కొన్ని అసెంబ్లీ సీట్లను కూడా గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంపికలో రాజకీయ - సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల ఎంపిక కూడా వ్యూహాత్మకంగా సాగుతోంది. బహుముఖ ప్రయోజనాలు ఉంటేనే నామినేటెడ్‌ పోస్టులు వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో లేదా నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతున్నట్లు తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు తమతమ ప్రయత్నాలను ప్రారంభించారు.

అయితే సీఎం చంద్ర‌బాబు మాత్రం రాష్ట్రంలో నామినేట్‌ పదవులు స్వీకరించే నాయకులకు విస్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏ నాయకుడు పదవి అడిగినా 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో టికెట్టు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే విధమైన వర్తమానాన్ని నేతలందరికీ పంపించారు. ఈ విషయంలో అధినేత అంతరంగం తెలియడంతో ఖచ్చితంగా సాధారణ ఎన్నికల బరిలో దిగాలనుకునే వారు వెనుకంజ వేస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల కోసం కొందరైతే ప్రయత్నాలు చేయడం నిలిపివేశారని కూడా స‌మాచారం. ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన వివిధ కులాలకు చెందిన ఫెడరేషన్లకు చైర్మన్‌ లను - పాలకవర్గాలను కూడా ముఖ్యమంత్రి నియమించారు. డిమాండ్‌ ఉన్న కార్పొరేషన్ల కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా పట్టుపడుతున్నారు. ముఖ్యమైన కార్పొరేషన్లకు టీటీడీ పాలకవర్గంలో కూడా ఎమ్మెల్యేలను నియమించే సాంప్రదాయం మొదటినుంచి వుంది. దీంతో ఇటీవల విస్తరించిన కేబినెట్‌ లో మంత్రి పదవులు దక్కనివారు కూడా పలువురు ఎమ్మెల్యేలు పదవుల కోసం రేసులో ఉన్నారు. తాజాగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ కమిటీలలో ఎలాంటి పదవులు దక్కనివారు కూడా నామినేటెడ్‌ పదవుల వైపు దృష్టి సారించడంతో జాబితా పెద్దగా అయింది. మరో వారం రోజుల లోపే నామినేటెడ్‌ పదవుల విషయమై ముఖ్యమంత్రి జాబితాను విడుదల చేసే అవకాశముందని స‌మాచారం.