Begin typing your search above and press return to search.

టెక్ బాబుకు ఈవీఎంపై భ‌యాలు

By:  Tupaki Desk   |   12 Jun 2018 10:39 AM GMT
టెక్ బాబుకు ఈవీఎంపై భ‌యాలు
X
ఆ మ‌ధ్య‌ ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌ర‌స‌గా బీజేపీ గెలుపు నేప‌థ్యంలో స‌హ‌జంగానే రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఈవీఎంల ప‌నితీరు మీద అనుమానాలు త‌లెత్తాయి. ఈవీఎంల ట్యాంప‌రింగ్ మూలంగానే బీజేపీ గెలుపు సులువు అవుతున్న‌ద‌ని, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను బీజేపీ అప‌హాస్యం చేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈవీఎంలు పుట్టిన నాటి నుండి ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌వే. అప్ప‌టి నుండి ఎన్నిక‌ల క‌మీష‌న్ ఈ ఆరోప‌ణ‌లు ఖండిస్తూనే వ‌స్తుంది. అయితే కేంద్రంలో బీజేపీకి దూర‌మ‌యిన చంద్ర‌బాబుకు మాత్రం రాబోయే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే ఈవీఎంల భ‌యం మొద‌ల‌యింది. హైటెక్ ముఖ్య‌మంత్రిని అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు ఈవీఎంల గురించి ఇప్పుడు ఆందోళ‌న చెంద‌డం ఆశ్చ‌ర్యంగానే భావించాలి.

ఈవీఎంల పనితీరుపై అప్రమత్తంగా ఉండాల‌ని, ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునైనా దుర్వినియోగం చేయడం చాలా సులభ కాబ‌ట్టి ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా పార్టీ నేత‌లు సిద్దంగా ఉండాల‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో మ‌న‌కు గెలుపు అత్యంత అవస‌రం అని చెప్పుకొచ్చాడు చంద్ర‌బాబు. అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేర‌కు ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆర్థిక‌మంత్రి యనమల రామకృష్ణుడు ఈవీఎంల మీద అనుమానాలు వ్య‌క్తం చేస్తూ ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్ట‌గా చంద్ర‌బాబు నాయుడు దాన్ని బ‌ల‌ప‌రిచారు. ఈవీఎంల పనితీరుపై పార్టీ క్యాడర్‌ ను అప్రమత్తం చేయాలని, ఎన్నికల సంఘంతో పాటు దేశంలోని అన్ని వ్యవస్థలనూ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంద‌ని, అందుకే ఈవీఎంలు దుర్వినియోగం అవుతాయ‌ని య‌న‌మ‌ల ఆరోప‌ణ‌లు చేశాడు.

మ‌రో మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు ఇంకో అడుగు ముందుకేసి గ‌తంలోనే చంద్ర‌బాబు గతంలో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్‌ చేయొచ్చనే విషయాన్ని ఆధారాలతో పాటు నిరూపించారని అన్నారు. బ్యాలెట్ పేప‌ర్ మూలంగా ఓట‌ర్లు తాము ఎవ‌రికి ఓటేసింది తెలుసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, త‌మ‌కు మొద‌టి నుండి ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయ‌ని, ఇప్పుడు దీనిని జాతీయ‌స్థాయిలో చ‌ర్చానీయాంశంగా మారుస్తామ‌ని అన్నారు.

మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు - ఆయ‌న పార్టీ ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించ‌డం, ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం ఆడ‌లేక మ‌ద్దెల ఓడు చందంగా ఉంది. నాలుగేళ్ల పాల‌న‌లో అన్నింటా విఫ‌ల‌మయిన చంద్ర‌బాబు రాబోయే ఓట‌మిని ఈవీఎంల మీద‌కు నెట్టేందుకు ముందు జాగ్ర‌త్త‌గా ఇలాంటి చ‌వ‌క‌బారు వ్య‌వ‌హారాల‌కు దిగుతున్నాడ‌ని భావిస్తున్నారు.