Begin typing your search above and press return to search.

'ప్రజలు ఛీ కొడుతున్నారు' : బాబుతో తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   10 March 2018 12:23 PM GMT
ప్రజలు ఛీ కొడుతున్నారు : బాబుతో తమ్ముళ్లు
X
కేంద్ర మంత్రి పదవులకు మాత్రం రాజీనామాలు చేసి.. ఎన్డీయే లో మాత్రం ఇంకా కొనసాగుతుండడంపై ప్రజల్లో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయంటూ.. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.. అధినేత చంద్రబాబుకు తెలియజేశారు. ఈ విషయంలో తాము ఏదో డబుల్ గేమ్ ఆడుతున్నాం అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని వారు పార్టీ సీనియర్ నాయకులతో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో ఓపెన్ గానే గళం విప్పి తెలియజెప్పడం విశేషం. అయితే చంద్రబాబు మాత్రం.. మనల్ని ప్రజలు తిట్టడం గురించి మీరు పట్టించుకోవద్దు.. మనం భాజపాను తిట్టడం గురించి మాత్రమే శ్రద్ధ పెట్టి.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి అంటూ వారికి దిశా నిర్దేశం చేయడం గమనార్హం.

చంద్రబాబు నాయుడు తాను సీనియర్ నాయకులకు ఎలాంటి అక్షంతలు వేయదలచుకున్నా సరే ప్రజల రక్షణ కవచంలాగా వాడుకుంటారు. ప్రజలతో సర్వేలో అభిప్రాయం ఎలా తెలిసింది అంటూ సీనియర్లను తన అభిప్రాయాలు రుద్ది తప్పు పడుతూ ఉంటారు. ఇప్పుడు పార్టీలో నాయకులు కూడా అదే టెక్నిక్ ను ప్రయోగిస్తున్నారు. పార్టీ నిర్ణయం గురించి తమలో ఉన్న అభిప్రాయాలను ప్రజలపై రుద్ది చంద్రబాబుకు తెలియజేస్తున్నారు.

మంత్రులతో రాజీనామా చేయించిన వ్యవహారంపై ప్రజలు ఏమనుకుంటున్నారో అంటూ చంద్రబాబు నాయుడు పార్టీలో సీనియర్ నాయకులతో సమావేశంలో వాకబు చేశారు. ఈ సందర్భంలో ప్రజలంతా మంత్రులతో రాజీనామాలు మాత్రం చేసి ఎన్డీఏలో కొనసాగడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు అంటూ పలువురు నాయకులు నేరుగా చంద్రబాబుతోనే చెప్పడం గమనార్హం. సహజంగా ఇలాంటి విమర్శలు జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు - వాటిని సమర్థంగా తిప్పి కొట్టడానికి నాయకులు పరిధులలో పర్యటించాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేయడం విశేషం.

చంద్రబాబు నాయుడు ప్రజాభిప్రాయం ఎలా ఉంది అని అడుగుతారే తప్ప - అది తన అభీష్టానికి ప్రతికూలంగా ఉంటే సేకరించే అలవాటు ఆయనకు లేదని తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నాయకులు పెదవి విరుస్తున్నారు. ఆయన వైఖరి ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత రుచి చూడాల్సి వస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు.