Begin typing your search above and press return to search.

మోడీని కాపీ కొట్టేయ‌డమే బెస్ట్ అంటున్న బాబు

By:  Tupaki Desk   |   15 March 2017 7:43 AM GMT
మోడీని కాపీ కొట్టేయ‌డమే బెస్ట్ అంటున్న బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు త‌న పార్టీ నేత‌ల‌కు భ‌విష్య‌త్ రాజ‌కీయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఐదు రాష్ర్టాల‌ ఎన్నిక‌ల‌ను ప్ర‌స్తావిస్తూనే రాష్ట్ర అవ‌స‌రాలు - రాజ‌కీయ అవ‌సరాలు త‌దిత‌ర విష‌యాలను విశ్లేషించి బాబు ఈ నిర్ణ‌యం వెల్ల‌డించారు. అనంత‌పురం - పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - ఎంపీల సమావేశంలో బాబు ఈ మేరకు తన మనసులో మాట వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలసి పనిచేస్తుందని తన పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పుడున్న పరిస్థితిలో భవిష్యత్తులో బీజేపీతో కలసి వెళ్లకతప్పని ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో బీజేపీ నేతలతో ఎక్కడా ఘర్షణ పడవద్దని బాబు ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలసివెళ్లాల్సి ఉంటుంది కాబ‌ట్టి చిన్న చిన్న ఇబ్బందులను కలసి పరిష్కరించుకోండని బాబు స్ప‌ష్టం చేశారు. దీన్నిబట్టి రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ-బీజేపీతో కలసి వెళ్లటం ఖాయంగా కనిస్తోందని త‌మ్ముళ్లు డిసైడ్ అయ్యారు.

మ‌రోవైపు ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బాబు త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. ‘ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర‌ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు, చేసిన పనులు చెప్పడం, రాజకీయ వ్యూహాలు పన్నడం వ‌ల్ల‌నే ఐదు రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మనం కూడా ఇక్కడ పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అయినా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మనం కూడా చేసింది ప్రజలకు చెప్పాలి. ఈ ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేయాలి’ అని బాబు సూచించిన‌ట్లు ప్రచారం సాగుతోంది. సంక్షేమ ప‌థ‌కాలు - పెట్టుబ‌డులు - కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వ సంబంధాలు వంటివి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని కోరారు. వెలుగొండ ప్రాజెక్టును - పోలవరం ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే దిశ‌గా సాగుతున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని బాబు కోరారు.

ఇక ఎప్పట్లాగానే విప‌క్ష నేత జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంలో జగన్ పార్టీ పాల్గొనకపోవడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేత‌లు సెల్ఫ్‌ గోల్ చేసుకున్నారని, కనీస మానవత్వం కూడా ప్రదర్శించలేదని వ్యాఖ్యానించారు. వారిని ప్రజలు గమనిస్తున్నారని చంద్ర‌బాబు విశ్లేషించారు. ఇలాంటి విష‌యాల‌ను కూడా ఘాటుగా ప్ర‌జ‌ల‌కు చేరవేయాల‌ని పార్టీ నేత‌ల‌కు బాబు ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/