Begin typing your search above and press return to search.

ప్యాకేజీకే బాబు ఒప్పుకున్నారా?

By:  Tupaki Desk   |   5 Aug 2016 2:30 PM GMT
ప్యాకేజీకే బాబు ఒప్పుకున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం హోదా క‌ష్ట‌మ‌ని తేల్చిచెప్పిన నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే దేశ‌రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బాబు అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీకే త‌ల ఊపార‌ని హ‌స్తినా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

బాబు ఢిల్లీ టూర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోడితో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సంగతి తెలిసిందే. అయితే వివిధ మార్గాల ద్వారా చంద్ర‌బాబు సేక‌రించిన స‌మాచారం మేర‌కు కేంద్రం స్పెష‌ల్ స్టేట‌స్‌ కు సుముఖంగా లేద‌ని గ్ర‌హించారు. దీంతో ప్యాకేజీ స్వీక‌ర‌ణ ఉత్త‌మ‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అధికార వర్గాలతో పాటు - రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక వ్యక్తులు చెబుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా అంశాన్ని కేంద్ర నేతల వద్ద గ‌ట్టిగానే కోర‌నున్నార‌ట‌. అనివార్యమైతే ప్రత్యేక ప్యాకేజీయైనా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రకటించాలని కోరుతారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆర్థికశాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్థికశాఖలోని కీలక అధికారులు ఈ ప్రతిపాదనలతో సహా ఢిల్లీకి వెళ్లారు. ఈ ప్రతిపాదనల్లో అధికభాగం ప్యాకేజికి సంబంధించినవే ఉన్నాయి.

ఇదిలాఉండ‌గా స్పెష‌ల్ స్టేట‌స్ సందేహాలు నెల‌కొన్న నేప‌థ్యంలో గతంలో కూడా హోదా కన్నా... ప్యాకేజి అయితేనే మంచిద‌నే వాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. స్పెష‌ల్ స్టేట‌స్‌ ద్వారా ప్రాజెక్టులకు 90 శాతం నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుందని - దీనివల్ల వాస్తవంగా వచ్చే ఆదాయం కన్నా కేవలం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా వస్తుందని అప్పట్లో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ మీడియా తో వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో హోదా విమర్శల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం నుంచి ప్యాకేజిపై ప్రకటన చేయించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే కనీసం 50 నుంచి 75 వేల కోట్ల రూపాయల వరకు వచ్చే మూడేళ్లలో అందే అవకాశాలు ఉంటాయి.