Begin typing your search above and press return to search.

హోదా జోరుకు సమాధి చేసిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   19 Aug 2016 5:05 AM GMT
హోదా జోరుకు సమాధి చేసిన చంద్రబాబు
X
చంద్రబాబునాయుడు ఆగస్టు 15 రోజున అనంతపురంలో చేసిన ప్రసంగాన్ని గమనించిన వారికి ఆయన ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా అడగాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కొంచెం నమ్మకం కలిగింది. నిజానికి చంద్రబాబునాయుడు తొలినుంచి కూడా ప్రత్యేక హోదాకు తానే అడ్డు పడుతున్నాడని.. దానివల్ల రాష్ట్రానికే తప్ప ప్రభుత్వానికి అధికారంలో ఉన్న వారికి ఉపయోగం లేదని దాన్ని పట్టించుకోవడం లేదని చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే.. హోదా ఎందుకు.? ప్యాకేజీ వస్తే పనులు జరుగుతాయి..? అంటూ చంద్రబాబునాయుడు చాన్నాళ్లపాటూ మాయమాటలు చెప్పారు.

అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లిన తర్వాత.. వారిలోనూ ఆలోచన పెరిగింది. హోదాతో రాష్ట్రానికి జరిగే మంచి గురించి వైకాపా జనానికి తెలియజెప్ప గలిగింది. జనంలో అవేర్‌ నెస్‌ వచ్చేసరికి - చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. తాను కూడా హోదా గురించి మాట్లాడకపోతే జనం ఛీకొడతారని అనుకున్నారు. అందుకే గత పార్లమెంటు సమావేశాల్లో తెదేపా ఎం పీలతో మొక్కుబడిగా హోదా గురించి ఉద్యమం నడిపించారు. అనంతపురం ఆగస్టు 15 వేడుకల్లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నదంటూ తన ప్రసంగంలో చెప్పారు. మొత్తానికి హోదా గురించి ఆయన కూడా పట్టించుకుంటున్నారేమో అని అంతా అనుకున్నారు.

తీరా తాజా వార్తలను గమనిస్తోంటే చంద్రబాబు మళ్లీ నాలుక మడత పెట్టేసినట్లు కనిపిస్తోంది. మాట మార్చేశారు. హోదానో - ప్యాకేజీనో కేంద్రం స్పష్టం చేయాలంటూ కొత్తగా ఆయన పాట పాడుతున్నారు. మా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాల్సిందే అని పోరాడడం మానేసి - కేంద్రానికి ఆప్షన్స్‌ ఇవ్వడం గనుక ప్రారంభిస్తే.. వారు ప్యాకేజీ పేరు చెప్పి మరో వంచనకు శ్రీకారం చుడతారు. అయితే చంద్రబాబు అవినీతికి వీలుగా ప్యాకేజీ వస్తేనే బాగుంటుందనే ఆశతో.. ఇలా కేంద్రానికి ఆప్షన్స్‌ ఇస్తున్నారని.. హోదా గురించి తన జోరుకు తానే సమాధి కట్టేశారని ప్రజలు భావిస్తున్నారు.