Begin typing your search above and press return to search.

బాబుగారూ దళార్లకు చోటివ్వద్దు!

By:  Tupaki Desk   |   8 Nov 2017 7:21 AM GMT
బాబుగారూ దళార్లకు చోటివ్వద్దు!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇవాళ బడిపిల్లల ఇన్సూరెన్స్ కు సంబంధించి ఒక ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇది చాలా మంచి ఆలోచన. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు 8వ తరగతి వరకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్సు చేయించాలని అనుకుంటున్నారు. దీనివలన విద్యార్థికి - వారి తల్లికి కూడా బీమా వర్తిస్తుంది. ఏడాది పాటూ దుర్ఘటన జరిగితే లక్ష రూపాయల వరకు బీమా మొత్తం అందుతుంది. ఇది మంచి ఆలోచనే గానీ.. చంద్రబాబు సర్కారు ఈ వ్యవహారంలో దళార్లు చొరబడకుండా.. సక్రమంగా అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేసే ఆలోచనలు - ప్రకటించే సంక్షేమ పథకాలు మంచిగానే ఉంటాయి. కానీ వాటి ఆచరణలోనే సకల దుర్మార్గాలు చొరబడిపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ తమ పార్టీ వారి ప్రమేయాన్ని పెంచేస్తూ వారు అడ్డగోలుగా లబ్దిదారులకు అందే సంక్షేమాన్ని మధ్యలో కొంత కత్తెర వేసి కాజేయడానికి ప్రభుత్వాలు ఆస్కారం కల్పిస్తుంటాయి. అందుకు అనేక కొత్త మార్గాలు కూడా వెతుకుతుంటాయి. అలాంటి దళారీ వ్యవహారాలకు చోటివ్వకుండా ప్రభుత్వం ఈ పనిచేస్తే బాగుంటుంది. ఈ బీమా వల్ల ప్రభుత్వానికి భారం కూడా ఏమీ లేదు. సర్వశిక్షా అభియాన్ లో మిగిలిపోయిన నిధులతోనే ఈ పని చేయబోతున్నారు. పైగా ఇది ఈ సర్కారు చేసిన కొత్త ఆలోచన కూడా కాదు. ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాల్లో ఇదే పథకం అమలవుతోంది.

అయితే చంద్రబాబు సర్కారు మరో పనిచేయాల్సి ఉంది. ఈ పథకాన్ని ప్రెవేటు స్కూళ్లలోకూ ఉండాలని ఒక నిబంధన విధించాలి. ప్రతి ప్రెవేటు స్కూలు యాజమాన్యం.. పిల్లలనుంచి వేలల్లో ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. అలాంటివాళ్లు ఒక్కో విద్యార్థికి ఏడాదికి 20 రూపాయలు పెట్టాల్సి వచ్చినా.. భరించాలి. దీనికోసం అదనపు ఫీజులు వసూలు చేయకుండానే.. ఈ బీమా వర్తింజేసే సదుపాయం - నిబంధన రూపంలో ప్రభుత్వం తీసుకురావాలి. అప్పుడు.. కేవలం ప్రభుత్వ పాఠశాలలనే నిబంధన మాత్రమే కాకుండా.. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ దృష్టిలో ఉంచుకుని సర్కారు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఉంటుంది. అందరి సంక్షేమాన్ని కాంక్షించినట్లుగా ఉంటుంది. అయితే ముందే చెప్పినట్లు దళార్లు దోచుకోడానికి కాకుండా వాస్తవంగా చిన్నారుల సంక్షేమం ఉద్దేశించి ఈ పనిచేస్తే మంచిది.