Begin typing your search above and press return to search.

మోడీకి కోపం వచ్చే పని బాబు చేశాడా?

By:  Tupaki Desk   |   14 July 2016 9:28 AM GMT
మోడీకి కోపం వచ్చే పని బాబు చేశాడా?
X
ఇటు ఏపీలోనూ.. అటు కేంద్రంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఒక అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. ప్రచారం కోసం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ప్రధాని మోడీ ఆగ్రహం కలిగించే పని చేసినట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటం కనిపిస్తోంది. తన రష్యా పర్యటనలో భాగంగా రష్యా ప్రధాని డిమిట్రీ మెద్వెదేవ్ ను అమరావతిని సందర్శించాలని కోరటంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

రష్యాలో జరిగిన ఇన్నోఫ్రామ్ సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా ఉండటం.. తాజాగా జరిగిన సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే.. రష్యా ప్రధానిని అమరావతికి ఆహ్వానించిన విషయంలో చంద్రబాబు తన పరిధి దాటినట్లుగా చెబుతున్నారు. రష్యా ప్రధానిని ఏపీకి ఆహ్వానించటం సరికాదని.. గతంలో జపాన్ ప్రధాని విషయంలోనూ ఇదే తీరులో వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

జపాన్ పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన తిరుపతి ప్రసాదాన్ని జపాన్ ప్రధాని తిన్నట్లుగా.. ఎన్నికల్లో విజయం సాధించటానికి తిరుమల శ్రీవారి ఆశీస్సులు కారణంగా చెప్పినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. తన జపాన్ పర్యటన సందర్భంగా జపాన్ ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు.. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారని.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. వాస్తవంలో ఏం జరిగిందో తెలిసిందే. తాజాగా రష్యా పర్యటనలోనూ చంద్రబాబు ఇదే తీరులో వ్యవహరించటంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు సీరియస్ అవుతున్నట్లు చెబుతున్నారు.

ఒక దేశ ప్రధానిని ఆహ్వానించటానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందని.. ఒక స్నేహితుడ్ని ఆహ్వానించినట్లుగా ఆహ్వానించటం సరికాదని.. వాస్తవానికి ఇలాంటి ప్రక్రియ మొత్తం కేంద్రం చేపట్టాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పనులు ప్రధాని మోడీకి ఆగ్రహాన్ని కలిగిస్తాయని.. బాబు అత్యుత్సాహం మోడీకి మంట పుట్టించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దాదాపు పన్నెండేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తికి.. విదేశీ ప్రధానులతో ఎలా వ్యవహరించాలో తెలీకుండా ఉంటుందా?