Begin typing your search above and press return to search.

బాబు సానుభూతి డ్రామా..ఇరుక్కుపోతున్నాడా.?

By:  Tupaki Desk   |   15 Sep 2018 9:07 AM GMT
బాబు సానుభూతి డ్రామా..ఇరుక్కుపోతున్నాడా.?
X
పచ్చ మీడియాలో ఒకటే గగ్గోలు.. ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.. ఆయన్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ టీడీపీ నేతల పెడబొబ్బలు.. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు ఆందోళన చేశారు. అప్పుడు కేసు నమోదైంది. కోర్టుకు బాబు హాజరు కాకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

అయితే ఇదంతా మోడీనే చేస్తున్నారంటూ సానుభూతి కోసం ప్రయత్నాలు.. బాబు అండ్ కోసం చేస్తున్న ఈ ప్రచారం చివరకు ఆయనకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. కోర్టు ధిక్కారం కింద బాబును అండ్ కో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందంటున్నారు. బాబు ప్లే చేస్తున్న ఈ సింపతీ గేమ్ చివరకు ఆయన మెడకు చుట్టుకుంటుందేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

నిజానికి ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించినా కూడా పై కోర్టుకు వెళ్లే చాన్స్ ఉంది.. సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్ కు - చీఫ్ జస్టిస్ వద్దకు.. చివరకు రాష్ట్రపతి అభ్యర్థన వరకూ భారతీయ న్యాయ శాస్త్రాల్లో వెసులుబాటు కల్పించారు. ఇంతటి అవకాశాలున్న ఈ పరిస్థితుల్లో కేవలం కోర్టుకు హాజరుకాని చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోర్టుకు హాజరై లాయర్ ద్వారా మళ్లీ వాదించుకునేంత సింపుల్ కార్యాన్ని మొత్తం తెలుగు జాతికి జరిగిన అవమానంగా అంటకడుతూ.. బాబును మోడీ మూసేస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తూ టీడీపీ నేతలు అభాసుపాలవుతున్నారు. నిజానికి ఈ కేసుకు మోడీకి అసలు సంబంధమే లేదు.. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టగా అది కోర్టులో విచారణ సాగుతోంది. కోర్టు నోటీసులకు బాబు రాలేకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. న్యాయ వ్యవస్థలో సహజంగా జరిగే ఈ పరిణామాన్ని కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం మోడీ చేస్తున్నాడని గగ్గోలు పెట్టడం విస్మయాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కోర్టుకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం అనేది చాలా చిన్న ప్రక్రియ. హాజరై లాయర్ ద్వారా మిగతా పేషీల్లో వాదించుకునే వెసులుబాటు ఉంది. కానీ పచ్చ నేతలు ఇది బాబుకు జరిగిన అన్యాయంగా మోడీ చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు.

బాబు ఈ సానుభూతి గేమ్ తో ఓట్లు సంపాదించాలని స్కెచ్ గీస్తున్నారని అర్థమవుతోంది.. ఎంతైనా చంద్రబాబును మించిన స్క్రీన్ ప్లే ఎవ్వరికి సాధ్యం కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ఇప్పుడు అదే బీజేపీని బూచీగా చూపించి హైడ్రామా క్రియేట్ చేసి సానుభూతి పొందేందుకు బాబు మాస్టర్ ప్లాన్ చేశారని అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బాబు తనంతట తాను లొంగిపోయి.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి సానుభూతి పొందుతారేమో అన్నట్టుంది పరిస్థితి. టీడీపీ నేతల మాటల వాలకం చూస్తుంటే ఇదే వారు ఆశిస్తున్నది అనిపిస్తోంది. ఇదే అయితే మాత్రం ఎన్నికల వేల బాబు ఆడుతున్న ఈ ‘రాక్షస క్రీడ’ను ప్రజలందరూ అర్థం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ ప్రభంజనం వేళ.. బాబు ఆడుతున్న ఈ జైలు అరెస్ట్ గేమ్ ఆయనకు మైనస్ తప్పితే పెద్దగా ఒరిగేదేమీ కాదంటున్నారు..

ఇంకోమాట.. స్వయంగా చంద్రబాబే మహారాష్ట్రలోని కాంగ్రెస్ నేతలతో కోర్టులో ఇలా పిటీషన్ వేయించి అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేశాడని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారట . ఏమో అధికారం కోసం బాబు మామకే షాకిచ్చారు. ఇలా అరెస్ట్ నాటకం ఆడకుండా ఉంటారా అని వారు చర్చించుకుంటున్నారట . ఏది ఏమైనా ఏపీ సీఎం ఆడుతున్న ఈ నయా అరెస్ట్ నాటకం ఇప్పుడు ఆయనపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.