Begin typing your search above and press return to search.

పోలవరం.. వ్యవహారం అడకత్తెరలో తెలుగుదేశం!

By:  Tupaki Desk   |   25 Sep 2019 10:49 AM GMT
పోలవరం.. వ్యవహారం అడకత్తెరలో తెలుగుదేశం!
X
పోలవరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తీరు అడకత్తెరలో పోకవక్కలా తయారైంది. పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమకు కమిషన్లు కావాలనుకున్నప్పుడల్లా పోలవరం కాంట్రాక్టులకు పనులు చేసినా - చేయకపోయినా డబ్బులు విడుదల చేస్తూ వచ్చారు అనే ఆరోపణలను ఎదుర్కొన్నారు తెలుగుదేశం వాళ్లు. పోలవరాన్ని కేవలం కమిషన్ల వరంగా మార్చుకున్నారనే తీవ్రమైన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది.

అందుకు తగ్గట్టుగా అధికారంలోకి రాగానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్టుల పర్వంపై దృష్టి సారించారు. రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టారు. అక్కడ నుంచినే టీడీపీ గగ్గోలు మొదలైంది. రివర్స్ టెండరింగ్ అని జగన్ అనగానే.. ఇదంతా రివర్స్ పాలన అంటూ తెలుగుదేశం పార్టీ వ్యంగ్య ప్రచారం ప్రారంభించింది. అయితే తీరా జగన్ అనుకున్నది సాధించారు.

పోలవరం కాంట్రాక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ చేసి - గతంతో పోలిస్తే తక్కువ మొత్తానికి కాంట్రాక్టులను కొత్త కంపెనీలకు కట్టబెట్టారు. కొన్ని వందల కోట్ల రూపాయలను ఆదా చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చివెలగకాయ పడింది. తాము కట్టబెట్టిన మొత్తాల కంటే తక్కువ మొత్తాలకు జగన్ మోహన్ రెడ్డి కొత్తగా కాంట్రాక్టులు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడుకు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది.

చంద్రబాబు హయాంలో భారీ కమిషన్లు ఇవ్వడంతోనే కంపెనీలు పోలవరం టెండర్లను భారీ ధరకు కోట్ చేశాయని - ఇప్పుడు ఆ కమిషన్లు లేకపోవడంతో.. తక్కువ ధరకు టెండర్లను ఖరారు చేశాయని ప్రజలందరికీ స్పష్టత వస్తోంది. ఈ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి నోటమాటలు లేవు.

అందుకే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించని మాటలను కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమకు జరిగిన డ్యామేజ్ ను నియంత్రించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఉన్నారు. గవర్నమెంట్ మీద - కాంట్రాక్టర్ల మీద సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఏదో ఒక విష ప్రచారం చేయాలని - బురద జల్లాలని ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ తడబాటు అందరికీ స్పష్టం అవుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇక మరో రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికను రచించారు. అటు బడ్జెట్ ను మిగిల్చి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును కూడా పూర్తి చేసి..రెండేళ్లలోనే ప్రజలకు ఫలాలు అందేలా చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ కథ కంచికే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.