Begin typing your search above and press return to search.

బాబు స్పీచ్‌ వినలేక తమ్ముళ్లు ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   30 May 2017 5:17 AM GMT
బాబు స్పీచ్‌  వినలేక తమ్ముళ్లు ఏం చేశారంటే..
X
మహనాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు చిన్న‌పాటి అవ‌మానం జ‌రిగింది. కార్యకర్తలు ఆయనకు గాలి తీశారు. చంద్రబాబు మాట్లాడేందుకు మైకు అందుకోగానే కార్యకర్తలు, నేతలు మెల్లగా జారుకున్నారు. ఒకసారి కాదు, మూడు రోజుల మహానాడులో చంద్రబాబు మైకందుకున్న ప్రతి సందర్భంలోనూ ఇదే సీను రిపీటైంది.

చంద్రబాబు అంటే సుదీర్ఘ ఉపన్యాసాలకు ప్రసిద్ధి. చెప్పిందే చెబుతారని అధికారులు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. కానీ... మహానాడుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కార్యకర్తలు మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా చాకచక్యం చూపించారు. చంద్రబాబు మాట్లాడడానికి లేవగానే వారికి సీను అర్థమైపోయేది... ఇది ఇప్పుడిప్పుడే తేలేది కాదు, ఇందులో కొత్త విషయమూ ఏమీ ఉండదు. మూడేళ్లుగా పాడుతున్న పాటే కదా అనుకుంటూ వారు భోజనాలకు వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో చంద్రబాబుకు కోపం వచ్చినా తమాయించుకుని వారిని ఆపడానికి ప్రయత్నించారు.

తొలిరోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే కార్యకర్తలు, నేతలు వెంటనే భోజనాల వైపు వెళ్లిపోయారు. చంద్రబాబు ఎలాగూ కనీసం గంటన్నర మాట్లాడుతారన్న విషయం ఊహించిన కార్యకర్తలు సొంత పనులను చక్కబెట్టుకునేందుకు ప్రయత్నించారు. తొలి రోజు భోజనాలుచేసి అటు ఇటు బీచ్‌ కు వెళ్లిపోయారు. బీచ్‌ కు ఇప్పుడు వెళ్లవద్దు.. కావాలంటే సాయంత్రం వెళ్లండి అని చంద్రబాబు సూచించినా వారు వినలేదు.

ఆదివారం కూడా అదే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే కార్యకర్తలు భోజనాలకు పయనమయ్యారు. అప్పటికి ఇంకా సమయం 11.30 నిమిషాలే. దీన్ని గమనించిన చంద్రబాబు కార్యకర్తల తీరుపై సెటైర్లు వేశారు. ఇక్కడ భోజనాలు ఒక్కటే పనికాదంటూ వ్యాఖ్యానించారు. భోజనాలకు వెళ్లవద్దు అని నేరుగా చెబితే అది వివాదం అవుతుంది కాబట్టి ఆయన తెలివిగా... భోజనాలు ఒక్కటే పనికాదని… తినేది కూడా మితంగా తినాలని లేకుంటే నిద్ర వస్తుందని కామెంట్స్ చేశారు చంద్రబాబు. అయినా కార్యకర్తలు మాత్రం ఒక్కరు కూడా ఆగలేదు. మరికొందరు కార్యకర్తలు మెల్లగా సమీపంలోని బార్లు - వైన్ షాపుల వైపు అడుగులు వేశారు. దీంతో చంద్రబాబు మొహంలో చికాకు స్పష్టంగా కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/