Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యాన్స్ డౌట్‌!... జేపీ వెనుక బాబేనా?

By:  Tupaki Desk   |   30 March 2018 2:30 PM GMT
ప‌వ‌న్ ఫ్యాన్స్ డౌట్‌!... జేపీ వెనుక బాబేనా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో ఇప్పుడు దాదాపుగా అన్ని పార్టీలు కూడా పాలుపంచుకోక తప్ప‌ని ప‌రిస్థితి. అంతేనా... అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ఏ ఒక్క నేత కూడా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా మాట మాట్లాడనిదే మీడియా ముందు నుంచి వెళ్లిపోవ‌డం లేదు. మొత్తంగా అన్ని పార్టీల‌కూ ఇప్పుడు ప్ర‌త్యేక హోదానే ఆయుధంగా మారింది. గ‌డ‌చిన నాలుగేళ్లుగా అస‌లు ప్ర‌త్యేక హోదానే వద్ద‌ని, ఆ మాటెత్తితే జైల్లో పెట్టేస్తామ‌ని వార్నింగులిచ్చిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిందేన‌ని త‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. అస‌లు ఎక్క‌డికెళ్లినా... ప్ర‌త్యేక హోదా పోరులో తామే ముందున్నామ‌ని, బీజేపీ చేసిన అన్యాయంతో రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని కూడా చంద్ర‌బాబు... చెప్పిన మాటే ప‌దే ప‌దే చెప్పి... అరిగిపోయిన రికార్డు మాదిరే ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. అయినా ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌న్న మాట‌ను ప‌క్క‌న‌పెట్టేసి చంద్ర‌బాబు హోదా ఉద్య‌మంలోకి హ‌ఠాత్తుగా దూక‌డానికి... విప‌క్ష వైసీపీ ఓ కార‌ణం కాగా... మొన్న‌టికి మొన్న గుంటూరు జిల్లాలో రాష్ట్ర నూత‌న రాజ‌ధానికి కూత‌వేటు దూరంలో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ వేదిక నుంచి ఆ పార్టీ అధినేత హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లేన‌న్న వాద‌న లేక‌పోలేదు. ప్ర‌త్యేక హోదాపై టీడీపీ వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టిన ప‌వ‌న్‌... చంద్ర‌బాబు ఫ్యామిలీ అవినీతి దందాల‌పైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్‌... ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డంలో కీల‌క భూమిక పోషించారన్న వాద‌న తెలిసిందే. అప్ప‌టి నుంచి మొన్న‌టిదాకా టీడీపీకి మిత్రుడిగానే కొన‌సాగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఒక్క‌సారిగా నేరుగా చంద్ర‌బాబు ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ టీడీపీ వైఖ‌రిని తూర్పార‌బ‌ట్ట‌డంతో తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు చంద్ర‌బాబు షాక్ తిన్నార‌నే చెప్పాలి. అయితే ప్ర‌స్తుతానికి ప‌వ‌న్‌ పై నేరుగా పోరును ప‌క్క‌న‌పెట్టేసి... ప్ర‌త్యేక హోదానే ఆధారం చేసుకుని పోరాటం న‌డుపుతున్న చంద్ర‌బాబు... ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహానికి విరుగుడు ర‌చించార‌ని, ఇప్ప‌టికే ఆ వ్యూహం అమ‌ల్లోకి వ‌చ్చేసిందన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నీతివంత‌మైన రాజ‌కీయాలే ల‌క్ష్యంగా ఐఏఎస్ ప‌ద‌వినే తృణ‌ప్రాయంగా వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన లోక్ సత్తా వ్య‌వ‌స్థాప‌కుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ద్వారా ఈ వ్యూహాన్ని చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నార‌న్న కోణంలో ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ - జ‌న‌సేన శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న‌ట్లుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

అయినా చంద్ర‌బాబు ఏం వ్యూహం ర‌చించారు? ఆ వ్యూహంలో జేపీ పాత్ర ఏమిటి? అన్న విష‌యాల్లోకి వెళితే... ఉన్న‌ప‌ళంగా త‌మ‌పై ఎదురు దాడికి దిగిన ప‌వ‌న్‌ను అలాగే వ‌దిలేస్తే... భ‌విష్య‌త్తులో త‌మ‌కు ఇబ్బంది అనే చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో నేరుగా తాము కాకుండా త‌టస్థంగా ఉన్న వ్య‌క్తి ద్వారా ప‌వ‌న్ కీర్తిని బ‌జారుకీడిస్తే స‌రిపోతుంద‌న్న కోణంలోనే చంద్ర‌బాబు ఆ వ్యూహాన్ని ర‌చించార‌ట‌. ఈ వ్యూహం ప్ర‌కారం... ప్ర‌త్యేక హోదాపై త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మాట్లాడే ప‌వ‌న్‌ను... నిల‌క‌డ‌లేమి క‌లిగిన నేత‌గానే కాకుండా ప్ర‌త్యేక హోదాపై ఏమాత్రం ఆస‌క్తి లేని వ్య‌క్తిగా చిత్రీక‌రించేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ (జేఎఫ్‌ సీ)లోని స‌భ్యుడినే రంగంలోకి దింపాల‌ని చంద్ర‌బాబు భావించార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆ క‌మిటీలోని జేపీ... బాబుకు క‌నిపించార‌ని, దీంతో వెనువెంట‌నే వ్యూహాన్ని అమ‌లు చేసిన బాబు... జేపీని రంగంలోకి దించార‌న్న‌ది ప‌వ‌న్ ఫ్యాన్స్ అనుమానం. బాబు వ్యూహానికి స‌రేన‌న్న కార‌ణంగానే జేపీ ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - జేఎఫ్‌ సీల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కూడా వారు అనుమానిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ల‌గానే రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికిన జేపీ... జేఎఫ్‌ సీలో కీల‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తూ కూడా ఉన్న ప‌ళంగా మాట మార్చేస్తూ... జేఎఫ్‌ సీ స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు సీరియ‌స్ నెస్ లేద‌ని వ్యాఖ్య‌లు చేశారంటే... అందులో ఏదో వ్యూహం ఉంద‌నేగా అన్న‌ది ప‌వ‌న్ ఫ్యాన్స్ భావ‌న‌. నిన్న‌టిదాకా త‌న నోటితో కీర్తించిన వ్య‌క్తిని ఏ కార‌ణం లేకుండానే తెగ‌డ‌టం అంటే... అందులో ఏదో వ్యూహం దాగుంద‌నే క‌దా అని కూడా వారు అనుమానిస్తున్న‌ట్లుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. మొత్తంగా ప‌వ‌న్‌ను దునుమాడుతూ జేఎఫ్‌సీకి స‌మాంత‌రంగా ఓ క‌మిటీని ఏర్పాటు చేసిన జేపీ వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని, ప‌వ‌న్ ను అభాసుపాలు చేసేందుకు చంద్ర‌బాబు ర‌చించిన వ్యూహంలో భాగంగానే జేపీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నార‌న్న‌ది ప‌వ‌న్ ఫ్యాన్స్ వాద‌న.