Begin typing your search above and press return to search.

నిజంగానే.. బాబు అవుట్ డేటెడ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   30 March 2016 4:58 AM GMT
నిజంగానే.. బాబు అవుట్ డేటెడ్ అయ్యారా?
X
పట్టిసీమ మీద ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ఒక హిస్టరీగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటే.. దానంత వేస్ట్ ప్రాజెక్ట్ మరొకటి ఉండదంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినిపించిన వాదన వింటే నిజమేనన్న భావన కలగటం ఖాయం. మంగళవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ వినిపించిన వాదనల్లో కీలకాంశాలు చూస్తే.. పట్టిసీమ విషయంలో చంద్రబాబు ఇమేజ్ ను జగన్ డ్యామేజ్ చేశారన్న భావన కలగటం ఖాయం. రూ.1600 కోట్లతో నిర్మించిన పట్టిసీమ కారణంగా ఏపీకి ఎంత నష్టమో జగన్ చెప్పుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగన్ చేసిన వాదన కొంతమేర కన్వీన్స్ అయ్యేలా ఉండటం గమనార్హం. జగన్ వాదనలోకి కొన్ని కీలకాంశాలు వింటే ఈ మాటలో నిజం ఎంతో ఇట్టే అర్థమవుతుంది.

‘‘పట్టిసీమతో నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాను కాపాడానని చంద్రబాబుచెప్పటం ఆశ్చర్యంగా ఉంది. 180 టీఎంసీల అవసరం ఉండే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 4 టీఎంసీల నీళ్లు ఇచ్చి ఎలా కాపాడతారో నాకు అర్థం కావటం లేదు’’
‘‘ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేసిన ఘనత తనదేనని చంద్రబాబు చెబుతున్నారు. పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాను కాపాడినట్లుగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. ఇంతే ఖర్చును పోలవరం ప్రాజెక్టుకు పెట్టి ఉంటే ఆ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చి ఉండేది. ఇదే మొత్తాన్ని గాలేరు – నగరి ప్రాజెక్టు మీద పెడితే అది పూర్తి అయ్యేది. హంద్రీనీవా మీద పెడితే అదో కొలిక్కి వచ్చేది. పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లను నీళ్ల పాటు చేశారు’’

‘‘పోలవరం ప్రాజెక్ట్ కు జులై.. నవంబరు వరకూ నీళ్లు ఎక్కువగా వస్తాయి. కృష్ణాలో కూడా సెప్టెంబర్.. అక్టోబర్ లోనూ ఇదే మాదిరి నీళ్లు వస్తాయి. అందువల్ల నీటిని నిల్వ చేస్తేనే మనం ఉపయోగించుకోగలమని దశాబ్దాల క్రితమే ప్రణాళికను రూపొందించి పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. 2015-16లో 2 వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలైనట్లు రికార్డులే చెబుతున్నాయి. అసలు పట్టిసీమ స్టోరేజీ కెపాసిటీ ఎక్కడుంది? నిల్ల చేసే సదుపాయమే లేనప్పుడు పట్టిసీమ వల్ల ఉపయోగం ఏంటి? 190 స్టోరేజ్ కెపాసిటీ ఉంది కాబట్టే పోలవరాన్ని ప్రతిపాదించారు’’

‘‘పట్టిసీమ వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ లోని క్లాజ్ నెంబరు 7ఈ.. 7ఎఫ్ ప్రకారం తెలంగాణ.. మహారాష్ట్ర.. కర్ణాటక ప్రబుత్వాలు దీన్ని వివాదం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు రావాల్సిన నీళ్లను పాలమూరు నుంచి రంగారెడ్డి వరకూ లిఫ్ట్ పెట్టి టెండర్లు పిలిస్తే చంద్రబాబు ఎందుకు అడ్డుకోవటం లేదు? పట్టిసీమ ప్రాజెక్టు కట్టటంతో క్లాజ్ 7ఈ.. 7ఎఫ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అడగలేకపోతున్నారు’’

‘‘తెలియని వ్యక్తికి చెప్పొచ్చు. తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడొచ్చు. కానీ.. అన్నీ తెలుసని అనుకునే అజ్ఞానితో మాత్రం మాట్లాడటం ఎవరికి చేతకాదు. చంద్రబాబు నాయుడు దాదాపు గంటన్నర అనర్గళంగా మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైన విషయం ఒక్కటే. తాను అవుట్ డేటెడ్ అయిపోయానని తన గురించి చెప్పకనే బాగా చెప్పేసుకున్నారు’’