Begin typing your search above and press return to search.

అసలు ఈ అమరావతి పాపం ఎవరిది బాబూ.?

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:24 AM GMT
అసలు ఈ అమరావతి పాపం ఎవరిది బాబూ.?
X
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నా.. అమరావతిని మార్చవద్దు.. తొందరపడవద్దని’ జగన్ ను వేడుకున్నారు. బతిమిలాడారు.. బామాలారు..

మొన్నటి వరకు అమరావతి రాజధాని పేరుతో ఆందోళనలను ఇదే బాబు జోరుగా చేయించారు. తన మీడియాతో ఉవ్వెత్తున ఎగుస్తోందంటూ ప్రపంచవ్యాప్తంగా ఎగదోశారు. రాజధాని రైతులతో కలిసి ఎంత యాగీ చేయాలో అంతా చేశారు. ఆ ప్రయత్నాలకు వైసీపీ సర్కారు లొంగకపోవడంతో ఇప్పుడు అసెంబ్లీకొచ్చి రెండు చేతులెత్తి జగన్ ను వేడుకుంటున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటున్న ప్రేలాపన చంద్రబాబులో చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి ఇప్పుడు సీఎం జగన్ ను వేడుకునే ఖర్మ చంద్రబాబుకు పట్టడానికి అసలు కారణం బాబే. ఆయన చేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు జోలపట్టి.. చేతులెత్తి అడుక్కునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐదేళ్లు.. ఎంతో పెద్ద కాలం.. ఐదేళ్లలో అద్భుతాలు చేయవచ్చు. పక్కరాష్ట్రం సీఎం ప్రపంచాన్ని అబ్బురపరిచే ‘కాళేశ్వరం’ను మూడేళ్లలో కట్టారు. ఇదే ఏపీకి 5 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరిట జాప్యం చేశారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు కనుక చిత్తశుద్ధితో శాశ్వత అసెంబ్లీ - సచివాలయం - హైకోర్టుతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు - మౌళిక సదుపాయాలు కనుక కట్టి ఉంటే ఇప్పుడు అమరావతిని మార్చే సాహసం జగన్ చేసి ఉండేవాడు కాదు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరిట దోపిడీ కథలకు టీడీపీ ప్రభుత్వం ఎగదోయడంతో ఇప్పుడీ దుస్తితి పట్టింది.

అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది.. ఇలా బాబులా అధికారం ఉన్నప్పుడు చేయకుండా దిగిపోయాక దండాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు - టీడీపీ నేతలు కూడా ఆడిపోసుకుంటున్నారు.