Begin typing your search above and press return to search.

బాబు..కాంగ్రెస్ పాలిట భస్మాసుర‌ హస్తం!

By:  Tupaki Desk   |   11 Dec 2018 9:08 AM GMT
బాబు..కాంగ్రెస్ పాలిట భస్మాసుర‌ హస్తం!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మ‌రో అప్ర‌తిష్ఠ మూట‌గ‌ట్టుకున్న‌ట్టుగా విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నేత‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకునే చంద్ర‌బాబు... త‌న హ‌స్త‌వాసితో ఎంత మందిని నాశ‌నం చేశార‌న్న విష‌యంపై ఈ విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. నేటి తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలోనే తెర మీద‌కు వ‌స్తున్న ఈ విశ్లేష‌ణ‌లు చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. అస‌లు చంద్ర‌బాబు వ్యూహం ప్ర‌కారం టీడీపీతో పొత్తు పెట్టుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బావుకున్న‌దేమిట‌న్న విష‌యంతో మొద‌లువుతున్న ఈ విశ్లేష‌ణ‌లు... చంద్ర‌బాబును కాంగ్రెస్ పాలిట భ‌స్మాసుర హ‌స్తంగా తేల్చేస్తున్నాయి. ఈ కోణంలో సాగుతున్న విశ్లేష‌ణ‌లు నిజంగానే చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు... నేటి తెలంగాణ ఎన్నిక‌ల దాకా ముఖ్య‌మైన ఘ‌ట్టాల‌ను ప్రస్తావిస్తూ కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఆ విశ్లేష‌ణ‌లు ఎలా సాగుతున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... తొలుత కాంగ్రెస్ పార్టీతోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగు నేల నుంచి త‌రిమికొట్టేందు కోస‌మే జ‌న్మించిన తెలుగు దేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో తొలుత గెలుపు ద‌క్కినా... వెనువెంట‌నే మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ దెబ్బ‌కు సెకండ్ టైంలోనే సొంతూరు చంద్ర‌గిరి ఓట‌మితో బొప్పి క‌ట్టిన చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత చిత్తూరు జిల్లాలో విసిరివేసిన‌ట్టుగా మారుమూల‌గా ఉన్న కుప్పంకు పారిపోయారు. త‌ద‌నంత‌ర కాలంలో ఏకంగా త‌న‌కు రాజ‌కీయంగా పున‌ర్జ‌న్మ‌ను ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. త‌ద‌నంత‌రం వామ‌ప‌క్షాల‌తో దోస్తీ క‌ట్టిన చంద్ర‌బాబు.... విద్యుత్ ఉద్య‌మంలో భాగంగా ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై తూటాలు కురిపించి మ‌రో మ‌ర‌క‌ను అంటించుకున్నారు. ఏనాడూ ఒంటరిగా ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం చేయ‌ని - చేయ‌లేని చంద్ర‌బాబు... ప్ర‌స్తుత తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న‌దైన మంత్రాంగం న‌డిపారు.

ఈ మంత్రాంగంతో త‌న‌కు ఏ మేర ప్ర‌యోజ‌నం ద‌క్క‌నుంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... కాంగ్రెస్ పార్టీని న‌ట్టేట ముంచేందుకే చంద్ర‌బాబు ప్రాధాన్య‌మిచ్చిన‌ట్టున్నారు. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఎంతో కొంత గౌర‌వం ఉంది. కొంత మేర సాఫ్ట్ కార్న‌ర్ కూడా ఉంది. అయితే తెలంగాణ‌పై రెండు నాల్క‌ల ధోర‌ణితో ముందుకు సాగిన చంద్ర‌బాబు... ఆది నుంచి తెలంగాణ‌కు శ‌త్రువుగానే కొన‌సాగారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో త‌న‌పై ఉన్న ఈ ముద్ర‌ను తొల‌గించుకునేందుకు చంద్ర‌బాబు... ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నుంచి తీసివేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. ఎందుకంటే... తెలంగాణ ఎన్నిక‌ల్లో భాగంగా టీడీపీతో జ‌ట్టుక‌ట్ట‌నంత వ‌ర‌కు కాంగ్రెస్‌ పై ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. అయితే ఎప్పుడైతే... తామంతా శ‌త్రువుగా భావించే చంద్ర‌బాబుతో జ‌ట్టు క‌ట్టిందో.. ఆ మ‌రుక్ష‌ణ‌మే ఆ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు ఏవ‌గించుకోవడం మొద‌లెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల ఖ‌రారుకు సంబంధించిన క‌స‌ర‌త్తు... చంద్ర‌బాబు అమ‌రావతిలో నిర్వ‌హించార‌న్న ప్ర‌చారం కూడా తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను బాగానే గాయ‌ప‌రిచింద‌న్న వాద‌నా లేక‌పోలేదు.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉన్న సాఫ్ట్ కార్న‌ర్ కాస్తా... యాంటీ కార్న‌ర్‌ గా మార‌డంతో సంచ‌ల‌న ఫ‌లితాలు వ‌చ్చాయి. మొత్తంగా బాబుతో దోస్తీ కార‌ణంగా కాంగ్రెస్ పార్టీకి మేలు జ‌ర‌గక‌పోగా... భారీ దెబ్బ ప‌డిపోయింది. ఒక్క తెలంగాణ ఫ‌లితాలే కాకుండా... తెలంగాణ‌తో పాటు దేశంలోని మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను విశ్లేషిస్తే కూడా ఈ వాద‌న క‌రెక్టేన‌న్న విష‌యం తేలిపోనుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. చ‌త్తీస్‌ గ‌ఢ్ - రాజ‌స్థాన్ ల‌లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌బోతోంది. ఏళ్లుగా బీజేపీ పాల‌న‌లోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే కూడా మెజారిటీ స్థానాల‌ను ద‌క్కించుకుంది. మిజోరాంలో బీజేపీకి ఏమాత్రం తీసిపోని విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల‌ను సాధించింది. అంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురు గాలి వీస్తున్న కీల‌క త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓ నిర్ణ‌యం... ఆ పార్టీని తెలంగాణ‌లో భారీ దెబ్బ కొట్టింద‌న్న మాట‌. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగిన మూడు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ‌లో మాత్రం బాబుతో దోస్తీ ఫ‌లితంగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కంటే కూడా తీసిక‌ట్టుగా అతి త‌క్కువ సీట్ల‌కు ప‌రిమితం అయిపోయింది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబును కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ పాలిట భ‌స్మాసుర హ‌స్తంగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని ఈ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.