Begin typing your search above and press return to search.

బాబు చెబుతున్నదే.. చేసి ఉంటే బాగుండేది

By:  Tupaki Desk   |   14 July 2015 1:45 PM GMT
బాబు చెబుతున్నదే.. చేసి ఉంటే బాగుండేది
X
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా భారీ తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌టం.. 27 మంది మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ఈ దారుణ ఘ‌ట‌న‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొన్ని సూచ‌న‌లు చేశారు. గోదారి ప్ర‌వ‌హించే ఏ ఘాట్ లో స్నానం చేసినా.. పుణ్యం వ‌స్తుంద‌ని.. రాజ‌మండ్రిలో మొత్తం 32 పుష్క‌ర ఘాట్లు ఉన్నాయ‌ని.. ఏ ఘాట్ లో చేసినా పుణ్య‌మేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

భ‌క్తులు మొత్తం ఒకే ఘాట్ కు రావొద్ద‌ని సూచ‌న చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో 150.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 120 ఘాట్లుఉన్నాయ‌ని.. అందుకే.. ఎవ‌రికి వారు వారికి ద‌గ్గ‌ర‌ల్లోని ఘాట్ల‌కు వెళ్లాని.. పుష్క‌రాలు సాగుతున్న 12 రోజుల్లో ఎప్పుడు పుష్క‌ర స్నానం చేసినా పుణ్య‌మేన‌ని చెప్పుకొచ్చారు.
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల్లో స‌త్యం ఉంది. ఆయ‌న మాట‌ల్ని కాద‌న‌లేం. కానీ.. ఇలాంటి మాట‌లు చెప్పే చంద్ర‌బాబు.. చేత‌ల్లో కూడా చేసి చూపిస్తే బాగుండేది. ఎక్క‌డ పుష్క‌ర స్నానం చేసినా ఒక‌టే పుణ్య‌ఫ‌లం అని చెప్పిన‌ప్పుడు.. ముఖ్య‌మంత్రి లాంటి వ్య‌క్తి.. ఏ మాత్రం ప్రాధాన్య‌త లేని ఘాట్ల‌లో స్నానాలు చేసి ఉంటే.. బాగుండేది.

ఇప్ప‌టికి జ‌రిగింది జ‌రిగినా.. రానున్న ప‌ద‌కొండు రోజుల్లో అయినా వీవీఐపీలు.. ప్ర‌ముఖులు పుష్క‌ర స్నానాలు చేయాల్సి వ‌స్తే.. వారికి అప్రాధాన్య‌మైన ఘాట్ల‌లో స్నానం ఆచ‌రించేలా చేయ‌టం ద్వారా.. తాము చెబుతున్న‌ది నిజ‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేయాలి. నిజానికి ఇలాంటి సూచ‌న‌లు రాజ‌కీయ నేత‌ల కంటే కూడా.. అధ్యాత్మిక వేత్త‌లు.. స్వామీజీల ద్వారా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ నిద్ర‌పోయిన బాబు స‌ర్కారు.. ఇప్ప‌టికైనా నిద్ర లేచి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది.