Begin typing your search above and press return to search.

చంద్రబాబు పిలుపు ఆచరణ సాధ్యమేనా ? నేతల్లో టెన్షన్

By:  Tupaki Desk   |   10 Oct 2020 8:50 AM GMT
చంద్రబాబు  పిలుపు ఆచరణ సాధ్యమేనా ? నేతల్లో టెన్షన్
X
చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుండి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన, ఆందోళన కార్యక్రమాలకు పిలుపిచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి రాజధానికి మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆందోళన సోమవారం నాటికి 300 రోజుకు చేరుకుంటుందట. ఈ సందర్భంగా ఆందోళనకారులకు మద్దతుగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్నే చంద్రబాబు నేతలతో జరిగిన కాన్ఫరెన్సులో మాట్లాడుతూ మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను ఆదేశించారు.

చంద్రబాబు చెప్పిన ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఎండగట్టాలట. ఆదివారం సాంఘీభావ ర్యాలీలు నిర్వహించాలట. మహాత్మా గాంధి, అంబేద్కర్, జ్యోతిరావు పూలె, ఎన్టీయార్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించాలట. ఆదివారం రాత్రి అందరు స్కై లాంతర్ల ద్వారా తన నిరసన తెలపాలట. ఇక సోమవారం ఉదయం నియోజకవర్గాల్లోని ఎంఆర్వో కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేయాలని ఆదేశించారు.

చంద్రబాబు ప్రకటించిన మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికలో శనివారం కార్యక్రమం తప్ప మిగిలిన రెండు రోజుల కార్యక్రమాలు జరపటం అంత తేలికకాదు. ప్రెస్ మీట్లంటే తమ ఇళ్ళల్లోనో లేకపోతే పార్టీ ఆఫీసుల్లోనో కూర్చుని మాట్లాడేస్తారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఆదివారం ర్యాలీలు, వినతిపత్రాలు ఇవ్వటమంటే అది రోడ్లపైకి వచ్చి బహిరంగంగా చేయాల్సిన కార్యక్రమాలు. అలాగే సోమవారం ఎంఆర్వో కార్యాలయాల ముందు దీక్షలు, నిరసనలంటే సమస్యలు తప్పవు. కరోనా వైరస్ కారణంగా ఎపిడమిక్ యాక్ట్ అమల్లో ఉంది. కాబట్టి రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేసే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేసి లోపలేసేస్తే విడిపించేదెవరు ?

ఒకవేళ చంద్రబాబుకు కావాల్సింది ఇదే అయితే ఒకసారి అరెస్టయితే తమ భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎపిడమిక్ యాక్ట్ ను ఉల్లంఘించారనే కారణాలతో మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళనే పోలీసులు అరెస్టులు చేసి జైళ్ళకు పంపితేనే దిక్కులేదని ఇక తమలాంటి వాళ్ళను ఎవరు పట్టించుకుంటారంటూ చాలామంది నేతల్లో టెన్షన్ మొదలైంది. పైగా అమరావతికి మద్దతుగా రాయలసీమ ప్రధానంగా కర్నూలులో ఆందోళనలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకుంటారా ? అన్నది ప్రధాన డౌట్.

ఇలాగే విశాఖపట్నాన్ని రాజధానిగా వ్యతిరేకిస్తు ఆందోళనలు చేయటానికి ఎవరైనా నేతలు రోడ్లపైకి వస్తే జనాలు ఊరుకుంటారా ? అనే టెన్షన్ కూడా ఉత్తరాంధ్ర నేతల్లో పెరిగిపోతోంది. అమరావతి కరకట్టమీద ఇంట్లో కూర్చుని ఆదేశాలిచ్చేస్తే సరిపోతుందా ? క్షేత్రస్ధాయిలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అంటూ నేతల మదన పడిపోతున్నారు. మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు పిలుపు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.