Begin typing your search above and press return to search.

చంద్రబాబు పుణ్యస్నానం రహస్యం తెలుసా?

By:  Tupaki Desk   |   10 Aug 2016 8:31 AM GMT
చంద్రబాబు పుణ్యస్నానం రహస్యం తెలుసా?
X
గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో నెలకొన్న హడావుడి ప్రస్తుత కృష్ణా పుష్కరాల సమయంలో కనిపించడంలేదు. గోదావరి పుష్కరాల నాటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తోంది. కృష్ణానదిలో పుష్కరుడు ప్రవేశించే ముహూర్తాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం వెనకాడుతోంది... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ పుణ్య స్నానం చేస్తారన్నదీ రహస్యంగానే ఉంచింది.

సాధారణంగా పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఈ ముహూర్త సమయాన్ని ప్రభుత్వ ఆస్థాన పురోహితులు ప్రకటించాల్సి ఉంది. కానీ ఈసారి కృష్ణా పుష్కరాల్లో ముహూర్తాన్ని ప్రకటించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం భారీగా ప్రచారం చేసింది. ముహూర్త సమయాన్ని చాలా రోజుల ముందే ప్రకటించింది. దీంతో భక్తులంతా నిర్ణీత ముహూర్త సమయంలోనే పుణ్య స్నానాలు ఆచరించాలన్న ఉద్దేంతో అదే సమయానికి గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో తోపులాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ముహూర్తాన్ని ప్రకటించడం లేదని తెలిసింది. 11వ తేదీ సాయంత్రం కృష్ణ, గోదావరి పవిత్ర సంగమం వద్ద పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. మర్నాడు సూర్యోదయం నుంచి పుణ్య స్నానాలు చేయచ్చని పుష్కరాల ప్రత్యేక అధికారి తెలియచేయడం గమనార్హం.

పుణ్య స్నానంతో పుష్కరాలు ప్రారంభించే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఎక్కడ స్నానం చేస్తారన్నది స్పష్టత ఇవ్వలేదు. గోదావరి పుష్కరాల సమయంలో ఆయన సుమారు గంట సేపు నదీ తీరంలోనే ఉండడంతో జరిగిన పరిణామాలు తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు భక్తుల రద్దీ తక్కువ ఉన్న ప్రదేశంలో చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద ఆయన తొలి స్నానం చేస్తారని తెలుస్తోంది. ఈ ఘాట్‌కు గతంలో ఎప్పుడూ పెద్దగా భక్తుల తాకిడి ఉండేది కాదు. కానీ ఈసారి ఈ ఘాట్‌ను పెద్దఎత్తున తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు ఈ ఘాట్‌లో స్నానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అది కాకుంటే విఐపి ఘాట్ అయిన పున్నమి ఘాట్‌లో స్నానం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. మొత్తానికైతే ప్రభుత్వ వర్గాలు దీన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నాయి.