Begin typing your search above and press return to search.

అమరావతిలో అతిథుల గౌరవానికి కత్తెర!

By:  Tupaki Desk   |   28 July 2017 12:30 AM GMT
అమరావతిలో అతిథుల గౌరవానికి కత్తెర!
X
ఆతిథ్యరంగంలో అద్భుతాలు సృష్టించేయబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమూ, అమరావతి నగరం గురించి అనేక మార్లు ప్రస్తావించారు. కానీ ఆచరణలో మాత్రం ‘అతిథి’ అనే హోదాకు ఏమాత్రం విలువ లేకుండా చేసేస్తున్నారు. ప్రపంచం తలెత్తి చూసే రాజఢానిని అందిస్తానంటున్న చంద్రబాబు అమరావతి పరిధిలో అసలు అతిథిభవనం అనేదే అక్కర్లేదని, ప్రభుత్వ అతిథులు అందరినీ స్టార్ హోటళ్లలో పెడితే సరిపోతుందని సెలవిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే కీలక అతిథులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు, ఆతిథ్యం ఊసు లేకుండా స్టార్ హోటళ్లలో అందరితోపాటు పెట్టేయడం అనే ఆలోచనే చాలా చౌకబారుగా ఉంది అని పలువురు ఇప్పటికే ఈసడిస్తుండడం విశేషం.

ప్రభుత్వానికి ఎందరో విశిష్ట అతిథులు వస్తుంటారు. వీరు దేశ విదేశీ ప్రముఖులు అయిఉండే అవకాశం ఉంది. పైగా అంతో ఇంతో ప్రైవసీ అవసరం అయిన సమావేశాలు గట్రా నిర్వహించుకోవాల్సిన సందర్భాలూ అనేకం వస్తుంటాయి. ఇప్పుడున్న హైదరాబాదు నగరంతో పోల్చుకున్నప్పుడు.. నగరంలో పుష్కలంగా ఉన్న ప్రభుత్వ అతిథి భవనాలు ఆ లోటును తీరుస్తున్నాయి. విదేశీ ముఖ్యమంత్రులు - అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు తదితరులు వచ్చినప్పుడు ప్రభుత్వ అతిథి భవనాలను వారికి విడిదిగా ఇవ్వడం అనేది కేవలం వసతుల విషయమే కాదు.. హోదా కూడా!

అయితే అమరావతి నగరంలో ప్రభుత్వ అతిథిభవనాలు అంటూ అసలు ఉండవట. ప్రెవేటు రంగంలో స్టార్ హోటళ్లను పుష్కలంగా పోషించదలచుకుంటున్న చంద్రబాబునాయుడు సర్కారు.. నిరంతరంగా వారికి లబ్ధి చేకూర్చడానికి అన్నట్లుగా.. ప్రభుత్వానికి వచ్చే అతిథులందరికీ కూడా స్టార్ హోటళ్లలోనే బస కల్పించవచ్చునని, ప్రత్యేకంగా, అతిథిభవనాలు అవసరం లేదని అంటున్నది. తాజాగా సీఆర్డీయే సమీక్ష సమావేశంలో చంద్రబాబునాయుడు ఇలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా తెలుగుజాతి అంటేనే ఆత్మీయమైన ఆతిథ్యానికి పెట్టింది పేరు. వచ్చే అతిథులకు మనం కల్పించే ప్రత్యేక హోదా స్మరణకు రాకుండా ఉండేలా.. వారిని నలుగురితో పాటు హోటళ్లలో దింపితే సరిపోతుంది అనే తరహా ఆలోచన చంద్రబాబుకు ఎలా వచ్చిందో తెలియదని జనం వాపోతున్నారు.