Begin typing your search above and press return to search.

కదలని నేతల్ని మోయమని చెప్పే బదులు కత్తిరించేస్తే పోలా బాబు?

By:  Tupaki Desk   |   22 Feb 2022 5:30 AM GMT
కదలని నేతల్ని మోయమని చెప్పే బదులు కత్తిరించేస్తే పోలా బాబు?
X
కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటే మహా కష్టంగా ఉంటుంది చంద్రబాబుకు. నిజానికి ఇదే ఆయనకున్న లోపాల్లో ముఖ్యమైనది. ఎప్పుడు కఠినంగా ఉండాలన్న దానిపై మహా కన్ఫ్యూజన్ తో ఉంటారు టీడీపీ అధినేత. పార్టీకి సంబంధించి ఎవరైనా నేత తనకు తానుగా వెళ్లిపోవాలి.. లేదంటే తీవ్రమైన తప్పు చేయాలే తప్పించి వెళ్లిపోవాలే తప్పించి.. బాబు స్వయంగా వేటు వేసిందే కనిపించదు.

చేతిలో పవర్ లేనప్పుడు.. వేటు వేయటం అంత ఈజీ కాదనుకుంటే.. అందుకు బదులు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించే పని అయినా చేయాలి. కానీ..అలాంటివి కూడా చేయని తీరు చంద్రబాబులో కనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నమాటను అప్పుడప్పుడు చెప్పే చంద్రబాబు.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో.. విపక్షంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికి కదలని నాయకుల్ని పార్టీ మోయలేదని పేర్కొన్నారు.

ఇప్పటికి కొన్నిచోట్ల నాయకులు బయటకు రావటం లేదని.. వారి పని తీరు మీద ఫిర్యాదులు వస్తున్నాయని.. వారికి అనేకసార్లు చెప్పి చూసినా మార్పు రావటం లేదని.. సామాన్య కార్యకర్తలకు అండగా ఉండటం లేదని పేర్కొన్నారు. ఇక.. వేచి చూడటానికి పార్టీ సిద్ధంగా లేదన్న ఆయన.. పని చేయని వారిని భరించే అవసరం పార్టీకి లేదని స్పష్టం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనుకాడేది లేదన్న చంద్రబాబు.. మాటలకు బదులుగా చేతల్లో చేసి చూపిస్తే సరిపోతుంది.

కానీ.. అలాంటిదేమీ చేయని ఆయన.. మాటలతోనే సరిపెడుతున్నారు. ఈ ఏడాదికి టీడీపీ స్థాపించి నలభై ఏళ్లు అవుతున్న వేళ.. భారీ ఎత్తున ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించటంతోపాటు.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని.. మహానాడు నిర్వహణను పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. పని చేయకుండా.. కదలకుండా పార్టీకి భారంగా మారిన వారిపై వరుస వేట్లు వేసేంత ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడు వస్తుందో?