Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ అదర్స్....బాబు న్యూ స్ట్రాటజీ... ?

By:  Tupaki Desk   |   13 March 2022 7:30 AM GMT
జగన్ వర్సెస్ అదర్స్....బాబు న్యూ స్ట్రాటజీ... ?
X
ఉత్తరాదిన అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాల మీద ఏపీలో రాజకీయ చర్చ మామూలుగా జరగడం లేదు. కూడికలు తీసివేతలు బోలెడు లెక్కలతో అధినేతాశ్రీలు బిజీగా ఉన్నారు. ఒక పార్టీ గెలవాలన్నా నేల కరవాలన్నా కూడా రాజకీయ లెక్కలే ఆధారం. ఇక్కడ రెండూ రెండూ కలిస్తే నాలుగు అని మాత్రం ప్రతీసారీ ఆన్సర్ రాకూడదు.

మరిలాంటి లెక్కలలో పండిట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏపీలో వచ్చే ఎన్నికలు ఎలా జరిగితే గద్దెనెక్కగలం అన్న దాని మీదనే సీరియస్ గా ఫోకస్ పెట్టేశారు అంటున్నారు. ఏపీలో జగన్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఏకంగా 50 శాతం ఓట్ల షేర్ దక్కింది. ఇక టీడీపీకి నాడు 37 శాతం, జనసేన కూటమికి ఆరు శాతం, కాంగ్రెస్ బీజేపీలకు కలిపి ఒక శాతం ఓటింగ్ వచ్చింది.

ఈ లెక్కలు తీసుకుంటే అంతా కలసినా వైసీపీ ఓట్ల షేర్ దరిదాపుల్లోకి కూడా రాలేరు. అయితే అయిదేళ్లకు జరిగే ఎన్నికల్లో పాత లెక్క తారు మారు అవుతుంది. అంటే కచ్చితంగా యాంటీ ఇంకెంబెన్సీ వైసీపీకి ఉంటుంది. అలా చూసుకుంటే కచ్చితంగా అయిదు నుంచి పది శాతం దాకా ఓట్ల శాతం ఆ పార్టీకి 2024 నాటికి తగ్గుతుంది అని టీడీపీ లెక్కలు వేస్తోంది. అయితే 2014లో వైసీపీ దాదాపుగా 45 శాతం ఓట్ల షేర్ వచ్చింది. అంటే అది నికరం అనుకున్నా కూడా అన్ని పార్టీలు కలసి కట్టుగా పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలమని బాబు మార్క్ స్కెచ్ వేస్తున్నారుట.

ప్రతి ఒక్క ఓటుని ఒడిసిపట్టుకుంటేనే తప్ప వైసీపీని గద్దె దింపడం సాధ్యం కాదని కూడా టీడీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారుట. అంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు అన్నీ కలసి పోటీ చేస్తే 2014లో 45 శాతం పైగా ఓట్ల శాతం వచ్చింది. ఈసారి వామపక్షాలను కూడా కలుపుకుని పోయి మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్లాన్ అయితే టీడీపీ అధినాయకత్వానికి ఉంది అంటున్నారు.

అంటే అన్ని వైపుల నుంచి నట్లు గట్టిగా బిగించడమే కాదు వైసీపీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా ఎన్నిక సమరాన్ని తీసుకురావాలనుకుంటున్నారుట. ఆ విధంగా అయితే జగన్ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకుండా మహా కూటమికి పడుతుందని భావిస్తున్నారుట. టీడీపీ ఇలా నయా స్ట్రాటజీకి దిగడానికి కారణం యూపీ ఎన్నికల ఫలితాలే అంటున్నారు.

అక్కడ బీఎస్పీ, కాంగ్రెస్ మజ్లీస్ వంటి పార్టీలు వేరుగా పోటీ చేయడం వల్లనే భారీ ఎత్తున యోగీ సర్కార్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మరో మారు బీజేపీ పవర్ లోకి వచ్చిందని విశ్లేషించుకుంటున్నారు. మొత్తానికి అటు వైపు జగన్ ఇటు వైపు అంతా అంటూ 2024 నాటికి మూకుమ్మడి దాడి చేయలన్నదే బాబు గారి మాస్టర్ ప్లాన్ గా ఉందిట. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.